విజయవాడ సీపీతో జత్వానీ భేటీ
ఆధారాలన్నీ అందజేసిన బాధితురాలు
ఇబ్రహీంపట్నం రికార్డులన్నీ పరిశీలన
డీజీపీకి నివేదిక అందజేసిన విజయవాడ సీపీ
కాదంబరి జత్వానీ ఫోర్జరీ కేసుపైనా దర్యాప్తు
జైలులో సీసీ పుటేజీలపై పోలీసుల నజర్
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూస్ నెట్ వర్క్ ప్రతినిధి :
బాలీవుడ్ నటి అరెస్ట్ వ్యవహారంలో విజయవాడ పోలీసు కమిషనరేట్‌లో పని చేసిన ఐపీఎస్ అధికారుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇందులో ఓ మాజీ ఐపీఎస్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. తెర ముందు ముగ్గురు ఐపీఎస్ అధికారులుండగా, తెరవెనుక ఎంతమంది ఉన్నారన్నది తేలాల్చి ఉంది. కాకపోతే ఈ కేసులో కొత్త కొత్త ట్విస్టులు వెలుగులోకి రావడంతో ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్‌గున్నీ బయటకు రాగా, తెర వెనుక మరో ఇద్దరు అధికారులున్నారని తెలుస్తోంది. వీరి కాకుండా మరో 25 మంది ఖాకీలు కూడా ఉన్నట్లు సమాచారం అందుతోంది.
అత్యుత్సాహం చూపారు..
అత్యుత్సాహంతోనే కొందరు పోలీసు అధికారులు అరెస్ట్ చేశారని ప్రాథమికంగా గుర్తించారు. ఈ కేసుపై నివేదిక ఇవ్వాలని విజయవాడ సీపీ రాజశేఖర్ బాబును డీజీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో ముంబై నటి జత్వానీ, ఆమె కుటుంబ సభ్యులపై నమోదు చేసిన కేసు సీడీ ఫైళ్లను సీపీ రప్పించి పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులున్నట్లు గుర్తించారు. వీటిపై నివేదిక రూపొందించి డీజీపీకి అందజేశారు.
విజయవాడ సీపీతో జత్వానీ భేటీ
పోలీసు అధికారులపై జత్వానీ తీవ్ర ఆరోపణల దృష్ట్యా అధికారితో విచారణ చేయించాలని డీజీపీ ఆదేశించడంతో స్రవంతిరాయ్‌ను విచారణ అధికారిగా నియమించారు. ముంబై నటి శనివారం హైదరాబాద్ నుంచి విజయవాడ రానున్నారు. సీపీ రాజశేఖర్‌బాబును ఆయన కార్యాలయంలో కలవనున్నారు. విజయవాడ పోలీసులు తనను ఇబ్బంది పెట్టిన తీరును సీపీకి వివరించనున్నారు. అనంతరరం విచారణ అధికారి స్రవంతి రాయ్‌ను కలిసి తన వద్ద ఉన్న వివిధ పత్రాలు, ఆధారాలను అందించనున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఫిర్యాదుదారు వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్ తనకు పంపిన అసభ్యకర చిత్రాలు, వీడియో కాల్స్ గురించి సమాచారాన్ని జత్వానీ ఇవ్వనున్నారు.
ఫోర్జరీ కేసుపైనా దృష్టి
ఇక జత్వానీపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసును కూడా విచారణ అధికారి పరిశీలించనున్నారు. జగ్గయ్యపేటలోని తన 5 ఎకరాల భూమి సొంతం చేసుకునేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నం స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి, మరుసటి రోజు ముంబై వెళ్లి నిందితులను అరెస్టు చేయడంపై అనుమానాలున్నాయని ముంబై నటి తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు ఆరోపిస్తున్నారు.
42 రోజుల రిమాండ్‌లోనే
జెత్వానీపై కేసు నమోదు ముందు ఏపీలో పోలీసులు ముంబై రెక్కీ నిర్వహించినట్టు వార్తలు వస్తున్నాయి. ముంబైలో రెక్కీ నిర్వహించిన సమయంలో ఎస్ఐ స్థాయి అధికారుల టీమ్ ఒకటి ఢిల్లీ వెళ్లింది. అక్కడికి పోలీసుల టీమ్ ఎందుకు వెళ్లింది? సేకరించిన వివరాలేంటి? అనే దానిపై విచారణ టీమ్ ఫోకస్ చేసింది. ఇక సినీ నటిపై పోలీసుల తీరును మహిళా సంఘాలు ఖండిస్తున్నాయి. అన్యాయం జరిగితే న్యాయం చేయాల్సిన పోలీసులే ఓ మహిళపై అక్రమ కేసులు బనాయించటం ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ అని అంటున్నారు. సినీ నటిని ఇబ్బందిపెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. విజయవాడలోని జిల్లా కారాగారంలో ముంబై నటితోపాటు ఆమె తల్లిదండ్రులు 42 రోజుల పాటు రిమాండ్‌లో ఉన్నారు. ఈ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు జైలుకు కూడా వచ్చి ముంబైలో కేసు వాపసు కోసం ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.
జైలు సీసీ పుటేజీలపై పోలీసుల నజర్
వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కారాగారంలోని సీసీ కెమెరాల్లోని దృశ్యాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది. కేసులో నిందితురాలిగా ఉన్న వ్యక్తి పోలీసులపైనే తీవ్ర ఆరోపణలు చేసిన దృష్ట్యా విచారణను లోతుగా చేస్తామని విజయవాడ సీపీ రాజశేఖర బాబు తెలిపారు. దర్యాప్తులో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని, చట్టం ముందు అందరూ సమానులేనని స్పష్టం చేశారు. విచారణలో వెల్లడైన అంశాల ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని చెప్పారు.