ఆఫ్ఘనిస్థాన్ అలా తాలిబన్ల చేతిలోకి వెళ్లిందో లేదో అప్పుడే బాంబుల మోతలు మోగిపోతున్నాయి. ఆఫ్గాన్ రాజధాని కాబూల్ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఉగ్ర దాడితో హమీద్ కర్జాయ్ విమానాశ్రయం రక్తసిక్తమైంది. ఇప్పటి వరకు 6 పేలుళ్లు జరగగా… 72 మంది మృతి చెందారు. వీరిలో 60 మంది సాధారణ పౌరులు కాగా… 13 మంది అమెరికా సైనికులు. చనిపోయిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ఎయిర్‌పోర్ట్‌లో ఆత్మాహుతి దాడులను తాలిబన్లు ఖండించారు. ఐసిస్ గ్రూప్ కాబూల్ విమానాశ్రయంపై దాడులకు పాల్పడవచ్చని తాము ముందుగానే అనుమానించామని, ఇదే విషయాన్ని అమెరికాకు కూడా చెప్పామని ఓ ప్రకటనలో తెలిపారు. పేలుడు జరిగిన ప్రాంతం అమెరికా దళాల ఆధీనంలో ఉన్నట్టు పేర్కొన్నారు. కాబూల్ ఉగ్రవాద దాడులను ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఖండించారు.
మరోవైపు ఈ పేలుళ్ల నుంచి 160 మంది భారతీయులు సురక్షితంగా తప్పించుకున్నారు. వీరిలో 145 మంది సిక్కులు కాగా, 15 మంది హిందువులు. కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద బాంబు పేలుళ్లు సంభవించడానికి కొన్ని గంటల ముందే వీరందరినీ అక్కడి నుంచి భారత్ కు తరలించారు. ఆప్ఘన్ లో ఇంకా వేలాది మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. తాజా పేలుళ్ల నేపథ్యంలో అక్కడి నుంచి ప్రజలను తరలించడం మరింత క్లిష్టంగా మారింది. ఎయిర్ పోర్టు లోపల ఉన్నవారు సురక్షితంగా ఉన్నారని భావిస్తున్నప్పటికీ… ఎయిర్ పోర్టు బయటి పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు సామాన్యుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ఎయిర్ పోర్టులోకి ప్రవేశించే అవకాశం ఉందనే అనుమానాలు భయాలను మరింత పెంచుతున్నాయి.
ఇది కూడా చదవండి: చిలుక ఎగురుతూ వీడియో షూట్ చేయడం చూశారా..?