supreme court of india: సంచలనం సృష్టించిన పెగాసెస్ కుంభకోణం విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నేడు తీర్పు ఇవ్వనుంది. పెగాసెస్ స్పైవేర్‌ను నిబంధనలకు వ్యతిరేకంగా ఉపయోగించి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం నిఘా ఉంచిందా..? లేదా.. తెలుసుకోవాలి అనుకుంటున్నామని వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ 13న తీర్పు రిజర్వు చేసిన సంగతి తెలిసిందే.
ఈ కుంభకోణంపై నిపుణుల కమిటీతో సంప్రదించాల్సి ఉందని వ్యాఖ్యానించింది చీఫ్ జస్టీస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన బెంచ్. సంప్రదించిన కొంతమంది నిపుణులు వ్యక్తిగత కారణాలతో కమిటీలో భాగస్వామ్యం కా లేకపోయారని, అందువల్లే తీర్పు ఆలస్యం అవుతోందని సెప్టెంబరు 23న పేర్కొంది ధర్మాసనం..
అయితే, ఈ కేసులో సమగ్ర అఫిడవిట్ కేంద్రం అందించని నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ లేకుండానే ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేసింది సీజేఐ ధర్మాసనం. ఈ నేపథ్యంలో నేడు ఎలాంటి తీర్పు వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. కాగా, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందే బయటికి వచ్చిన పెగాసెస్ గూఢచర్యం వ్యవహారం సంచలనాన్ని రేపింది.
పార్లమెంటు సమావేశాలను ఈ వ్యవహారం కుదిపేసింది. విపక్షాలన్నీ పెగాసెస్‌పై చర్చ జరపాలని పట్టు బడడంతో.. ఇతర అంశాలపై చర్చ సాగకుండానే సమావేశాలు వాయిదా పడ్డాయి. అయితే, ఇజ్రాయెల్ సంస్థ అభివృద్ధి చేసిన పెగాసెస్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి ఇద్దరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జర్నలిస్టుల స్మార్ట్‌ఫోన్‌లపై కేంద్ర ప్రభుత్వం నిఘా వేసిందని కథనాలు వచ్చాయి.
కేంద్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పౌరుల వ్యక్తిగత గోప్యతను భంగం చేసిందని, అక్రమంగా వారి వ్యక్తిగత వ్యవహారాల్లోకి జొరబడిందని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. పెగాసెస్ నిఘాపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశాయి. కానీ, ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. ఈ నిరసనలతోనే పార్లమెంటు సమావేశాల్లో గందరగోళం నెకలొంది.