Friday, November 22, 2024

భారత సీజేఐగా జస్టిస్ ఎన్.వి.రమణ!

భార‌త సుప్రీంకోర్టు 48వ‌ ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ నియ‌మితుల‌య్యారు. రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆయ‌నను నూత‌న సీజేఐగా నియ‌మించారు. ఈ నెల 24వ తేదీన ఎన్వీ ర‌మ‌ణ సీజేఐగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఈ నెల 23న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌టంతో ఆయ‌న స్థానంలో నూత‌న సీజేఐగా ఎన్వీ ర‌మ‌ణ‌ను నియ‌మించారు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 26 వ‌ర‌కు ఆయ‌న ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

సుప్రీం కోర్టులో బోబ్డే తర్వాత సీనియర్ గా ఎన్వీ రమణ ఉన్నారు. దీంతో త‌దుప‌రి చీఫ్ జ‌స్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్వీ ర‌మ‌ణ పేరును ప్ర‌స్తుత సీజేఐ ఎస్ఏ బోబ్డే ఇటీవ‌ల సిఫార‌సు చేశారు. కేంద్ర న్యాయశాఖ, హోంశాఖ పరిశీలన తర్వాత ఈ ప్రతిపాదన రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది. కోవింద్ ఆమోదంతో సీజేఐ ఎంపిక పూర్తయింది. బోబ్డే త‌ర్వాత ఎన్వీ ర‌మ‌ణ‌నే సుప్రీంకోర్టులో అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తిగా ఉండ‌టంతో ఆయ‌న త‌దుప‌రి సీజేఐగా అవ‌కాశం ద‌క్కింది. ఏప్రిల్‌ 24న సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రమణ బాధ్యతలు స్వీకరిస్తారు. 2022 ఆగస్టు 26 వరకు 16 నెలలపాటు సీజేఐగా కొనసాగుతారు.

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌ 1957 ఆగ‌స్ట్ 27న కృష్ణా జిల్లా పొన్న‌వ‌రంలో ఓ వ్య‌వ‌సాయ కుటుంబంలో జ‌న్మించారు. 1983లో న్యాయవాదిగా ప్రాక్టీసు మొదలుపెట్టారు. 2000, జూన్ 27 నుంచి 2013, సెప్టెంబ‌ర్ 1 వ‌ర‌కు ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టులో న్యాయ‌మూర్తిగా ప‌ని చేశారు. ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు చీఫ్‌ జస్టిస్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2017 ఫిబ్ర‌వ‌రి 14 నుంచి సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తిగా ప‌నిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement