తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) జస్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం నోటీసు జారీ చేశారు. ఆగస్ట్ 26న పదవీ విరమణ చేయనున్న సీజేఐ ఎన్‌వీ రమణ స్ధానంలో జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక.. ఆగస్ట్ 27న లలిత్ 49వ సీజేఐగా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
ఇప్పటికే తన వారసుడిగా యూయూ లలిత్ పేరును సీజేఐ ఎన్‌వీ రమణ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు సూచించారు. నవంబర్ 8న జస్టిస్ యూయూ లలిత్ పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన సీజేఐగా కేవలం 74 రోజులు మాత్రమే కొనసాగనున్నారు. 1957 నవంబర్ 9న జన్మించిన లలిత్, జూన్ 1983లో న్యాయవాద వృత్తిని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగారు. 1985 డిసెంబర్ వరకూ బాంబే హైకోర్టులో పనిచేశారు. ఆపై ఢిల్లీలో సేవలు అందిస్తూ 2004లో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు జడ్జిగా బార్ ఆయనను సిఫార్సు చేయకముందు సీబీఐ తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా కూడా పనిచేశారు.