Friday, November 22, 2024

తెలంగాణకు ట్రిబ్యునల్‌ ఏర్పాటుతోనే కృష్ణ జలాల్లో న్యాయం.. కేఆర్‌ఎంబీతో ఏటూ తేలదు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదం మళ్లి మొదటికొచ్చింది. ఎటుతిరిగి ప్రత్యేక ట్రిబ్యునల్‌ వేస్తేగాని సమస్య పరిష్కారానికి మార్గం కనిపించడం లేదు. అంతరాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం -1956 లోని సెక్షన్‌-3 ప్రకారం ప్రత్యేక ట్రిబ్యునల్‌ వేస్తేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని తెలంగాణ సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) సమావేశంలో చర్చకు వచ్చిన అంశాలను నిపుణులు క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణా నదీ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య గతంలో మాదిరిగా 66:34 నిష్ఫత్తి ప్రకారమే పంచుతామని కేఆర్‌ఎంబీ చేసిన ప్రతిపాదినపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. నదీ జలాలను ఏపీ, తెలంగాణ మధ్య సమాన వాటా ప్రాతిపదికన పంచకపోవడంపై నిపుణులు మండిపడుతున్నారు. కనీసం ఆ అంశంపై బోర్డుకు అధికారం లేకపోతే అపెక్స్‌ కౌన్సిల్‌కు అధికారికంగా నివేదించాల్సి ఉండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అధికారం లేనపుడు అడ్‌హక్‌ (తాత్కాలిక) ప్రాతిపదికన గతంలో లోగా 66:34 నిష్పత్తిలో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి మాత్రం 512 టీఎంసీలు కేటాయిస్తామన్న బోర్డు ఛైర్మన్‌ ఎంపీ సింగ్‌ ప్రతిపాదన ఏపీ పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని నిపుణులు మండిపడుతున్నారు. శుక్రవారం నాటి భేటీతో కేఆర్‌ఎంబీ పరిధిలో కృష్ణా జలాల పున: పంపిణీ సమస్యకు పరిష్కారం దొరకదన్న విషయం తేలిపోయినట్లయింది. వాస్తవానికి గత ఎనిమిదేళ్లుగా బోర్డు తాత్కాలిక పద్దతి పేరున తెలంగాణను కృష్ణలో 34శాతం 299 టీఎంసీల వాటాకే ఒప్పిస్తోంది. శుక్రవారం జరిగిన సమావేశంలోనూ మరోసారి అదే పద్దతిని తెలంగాణ ఫాలో కావాలనటం సరికాదని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో సమస్యను కేఆర్‌ఎంబీ వద్ద ప్రస్తావించినా ప్రయోజనం శూన్యం అని, అపెక్స్‌ కౌన్సిల్‌ లేదంటే సీడబ్ల్యూసీకి నివేదించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement