తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెను విరమించారు. డిమాండ్‌లు నెరవేరకపోయినా సీఎం కేసీఆర్ నుంచి వచ్చిన సానుకూల స్పందన, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఓవైపు కరోనా సెకండ్‌వేవ్ విజృంభణ కొనసాగుతుండగా.. జూనియర్ డాక్టర్లు తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ బుధవారం సమ్మెకు దిగారు. ఎమర్జెన్సీ సేవలు మినహా కరోనాయేతర విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. గాంధీ ఆస్పత్రి, ఉస్మానియా మెడికల్ కాలేజీ, ఉస్మానియా ఆస్పత్రి, టిమ్స్, ఎంఎన్‌జే, నిలోఫర్, కింగ్‌కోఠి, ఎర్రగడ్డలోని ఛాతీ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహించారు.
మరోవైపు గురువారం జూడాలతో చర్చలు జరిపిన తర్వాత 15 శాతం స్టైఫండ్ పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాళ మరోసారి డీఎంఈతో జూడాల చర్చలు జరిగిన తర్వాత జూనియర్ డాక్టర్లకు స్టైఫండ్ పెంచుతున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఉత్వర్వుల్లో పేర్కొంది.
ఈ జీవోలో 15 శాతం స్టైఫండ్ పెంపుకు ఆమోదం తెలిపింది. పెరిగిన స్టైఫండ్ ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఈ క్రమంలోనే సీనియర్ రెసిడెంట్లకు వేతనాలు రూ.70,000ల నుంచి రూ.80,500 వరకు పెరగనున్నాయి. ఈ రోజు జూడాల సమ్మె రెండో రోజుకు చేరగా, నేటినుంచి అత్యవసర సేవలను కూడా బంద్ చేస్తామని వారు హెచ్చరించారు. దాంతో దిగివచ్చిన తెలంగాణ ప్రభుత్వం స్టైఫండ్ పెంపుకు ఆమోద ముద్ర వేసింది.