Saturday, November 23, 2024

జూడాల సమ్మె బాట.. కరోనా రోగులకు తప్పని అవస్థలు

క‌రోనా క్లిష్ట స‌మ‌యంలో సేవ‌లు అందించాల్సిన జూనియ‌ర్ డాక్ట‌ర్లు మ‌ళ్లీ ఆందోళ‌న‌ బాట పట్టారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు బుధవారం నాటి నుండి సమ్మె బాట పట్టారు. తమ సమస్యల గురించి విన్నవించుకుంటున్నప్పటికీ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదని తెలంగాణ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. దీంతో బుధవారం నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. అత్యవసర వైద్య సేవలు మినహా అన్ని సేవలను బంద్‌ చేస్తున్నట్లు తెలిపింది. పెంచిన స్టైఫండ్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్‌ చేశారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నుండి సానుకూలంగా స్పందన రాకపోవడంతో  సమ్మెకు దిగాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా అసోసియేషన్ ప్రకటించింది.

ఇవాళ, రేపు అత్యవసర  విధులను మాత్రమే నిర్వహించనున్నారు. ఈ రెండు రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే   అన్ని రకాల విధులను బహిష్కరించాలని అసోసియేషన్ నిర్ణయం తీసుకొంది.  రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 6 వేల మంది జూనియర్ డాక్టర్లు, మరో వెయ్యి మంది సీనియర్ రెసిడెంట్లు ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వీరి సేవలే కీలకం కానున్నాయి. జూనియర్ డాక్టర్లతో పాటు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసిసోయేషన్ కూడ సమ్మెకు దిగనుంది. ఇప్పటికే ఈ సంఘం నేతలు కూడ డీఎంఈకి సమ్మె నోటీసు ఇచ్చారు. బుధవారం నాడు ఉదయం నుండి కోవిడ్ అత్యవసర, ఐసీయూ అత్యవసేవలకు మాత్రమే హాజరౌతామని ప్రకటించారు.  ఈనెల 19న గాంధీ ఆస్పత్రిని సందర్శించిన సీఎం కేసీఆర్‌ జూడాల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై తనకు వెంటనే ప్రతిపాదనలను పంపాలని కూడ ఆదేశించారు. అయినా కూడ ఈ విషయమై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాలేదని జూనియర్ డాక్టర్ల ప్రతినిధులు చెబుతున్నారు. అనివార్య పరిస్థితుల్లోనే సమ్మెకు దిగుతున్నట్టుగా వారు చెప్పారు. ఇదిలా ఉంటే జూనియర్ డాక్టర్లు సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కూడ ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది. కరోనా రోగుల చికిత్సకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.  …

ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం 15 శాతం స్టై ఫండ్ పెంచాల‌ని డిమాండ్ చేస్తున్న జూనియ‌ర్ డాక్టర్లు.. ప్రకటించిన విధంగా 10 శాతం ఇన్సెంటివ్స్ వెంటనే చెల్లించాల‌ని కోరుతున్నారు. ఇక‌, కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే… నిమ్స్ లో వైద్యం అందించేలా ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను అమ‌లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఇక‌, కరోనా విధుల్లో మృతి చెందిన వారికి ప్ర‌భుత్వం ఎక్స్‌గ్రేషియా ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement