జాతి వివక్ష వ్యాఖ్యలు ఇంగ్లండ్ క్రికెట్‌ను కుదిపేస్తోంది. ఆ టీమ్ యువ బౌలర్ ఓలీ రాబిన్‌సన్ కొన్నేళ్ల కిందట ఆసియా ప్రజలు, ముస్లింలపై చేసిన జాతి వివక్ష ట్వీట్లపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు విచారణ ప్రారంభించింది. ఇప్పటికే అతన్ని అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు స్టార్ క్రికెటర్లు కూడా చిక్కుల్లో పడ్డారు. ఐపీఎల్‌లో కోల్‌కతా కెప్టెన్‌గా ఉన్న ఇయాన్ మోర్గాన్, రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ కూడా గతంలో ఇండియన్స్‌ను వెక్కిరిస్తూ చేసిన ట్వీట్లపై ఈసీబీ విచారణ జరుపుతోంది. అక్కడి టెలిగ్రాఫ్ పత్రిక కథనం ప్రకారం.. మోర్గాన్, బట్లర్ ఇద్దరూ సర్ అనే పదం పదే పదే వాడుతూ ఇండియన్స్‌ను వెక్కిరించినట్లు ట్వీట్లు చేశారు. కావాలని తప్పుడు ఇంగ్లిష్ వాడుతూ చేసిన ఆ ట్వీట్లు ఇండియన్స్‌ను వెక్కిరించేలాగానే ఉన్నట్లు ఈసీబీ భావిస్తోంది. 2018 ఐపీఎల్ సందర్భంగా వీళ్లు ఈ ట్వీట్లు చేశారు. న్యూజిలాండ్ క్రికెటర్ బ్రెండన్ మెకలమ్ కూడా సర్ అనే పదం వాడుతూ ట్వీట్ చేశాడు.
బట్లర్ ఆ ట్వీట్లను తొలగించినా.. వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్ బయటకు వచ్చింది. విచారణ పూర్తయిన తర్వాత ఈ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలో వద్దో నిర్ణయిస్తామని ఈసీబీ చెప్పినట్లు టెలిగ్రాఫ్ వెల్లడించింది. రాబిన్‌సన్‌ను సస్పెండ్ చేసిన తర్వాత వీళ్ల పాత ట్వీట్లు కూడా వైరల్ అయ్యాయి. మరోవైపు ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్‌పైనా విచారణ జరిగే అవకాశం ఉంది. 2010లో అతడు తన సహచర బౌలర్ బ్రాడ్ హెయిర్‌కట్‌పై స్పందిస్తూ.. 15 ఏళ్ల లెస్బియన్‌లా కనిపిస్తున్నాడంటూ అండర్సన్ ట్వీట్ చేశాడు. దీనిపై అండర్సన్ స్పందిస్తూ.. ఎప్పుడో పదేళ్ల కిందట అలా చేశానని, ఇప్పుడు తానో వ్యక్తిగా మారిపోయానని, తప్పులు జరుగుతూనే ఉంటాయని అన్నాడు.