పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో బీజేపీ అప్రమత్తమైంది.
దేశంలోనే అత్యధిక అసెంబ్లీ సీట్లు ఉన్న ఉత్తరప్రదేశ్ సహా ఆరు రాష్ట్రాలకు వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వాటికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రణాళికలు రచించుకుంటోంది. ఆయా రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 5, 6వ తేదీల్లో సమావేశం కానున్నారు.
ఉత్తర్ ప్రదేశ్ తో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాలకు ఇంఛార్జిలుగా ఉన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఎన్నికల సన్నద్ధతపై వ్యూహాలతో సమావేశానికి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. ఆరు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో విజయం కోసం బీజేపీ ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతోంది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ప్రదర్శనపైనా సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలపై బీజేపీ తమ నేతలకు కీలక సూచనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కరోనా సమయంలో తమ పార్టీ సేవా హీ సంఘటన్ పేరుతో అందిస్తోన్న సేవా కార్యక్రమాలపై, ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నిలక ఫలితాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అసోం మినహా బీజేపీ ఎక్కడా విజయం సాధించలేదు. బెంగాల్‌లో మమతా బెనర్జీ, కేరళలో ఎల్‌డీఎఫ్, తమిళనాడులో డీఎంకే పార్టీలు విజయం సాధించాయి. ఇక పుదిచ్చేరిలో మిత్రపక్షంతో కలిసి అధికారం పంచుకుంది. ఈ నేపథ్యంలో ఆరు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తన సత్తా చాటాలని బీజేపీ పక్క వ్యూహంతో ముందుకెళ్తోంది.