హైదరాబాద్, ఆంధ్రప్రభ : గమ్యస్థానాలకు చేరుకునేందుకు రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు చేరుకున్న ప్రయాణీకులు సికింద్రాబాద్ ఘనటతో స్థంభించిపోయారు. ఎక్కడికక్కడ రైళ్లు, ఎంఎంటీఎస్, మెట్రో రైల్ సేవలు నిల్చిపోవడంతో నగరంనుంచి పలు ప్రాంతాలకు చేరాల్సిన ప్రయాణీకులు తమ పిల్లా పాపలు, లగేజీతో నరకం చవిచూశారు. సికింద్రాబాద్ పరిధిలో అప్రమత్తమైన రైల్వే శాఖ 71రైళ్లను రద్దుచేయడం, పలు రైళ్లను దారిమళ్లించడంతో స్టేషన్లలోకి ప్రయాణీకులెవరినీ అనుమతించలేదు. అప్పటికే రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులకు చెందిన చార్జీలను తిరిగి చెల్లిస్తామని రైల్వే శాఖ ప్రకటించింది.
నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రైళ్లు నిల్చిపోవడంతో ప్రయాణీకులు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కున్నారు. ఆందోళనలు మిన్నంటడంతో భద్రతా కారణాల దృష్య్ఠా రైల్వే శాఖ పలు రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్‌లో పరిస్థితి హద్దు మీరడంతో వివిధ జోన్లలో ప్రయాణించే రైళ్లను దారిమళ్లించింది. కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేసింది. అలంలర్లకు సంబంధించి ఆందోళనకారులతో చర్చలకు పలు దశల్లో ప్రయత్నించినప్పటికీ సాయంత్రం 7.30 గంటలవరకు ఎటువంటి పురోగతి కన్పించలేదు.
అయితే రాత్రి 7గంటలతర్వాత మెట్ర్‌ో రైల్ సేవలను పునరుద్దరించారు. దీంతో సిటీ ప్రయాణీకులకు కొంత ఊరట కల్గింది. కానీ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ప్రయాణీకుల భద్రతపై రైల్వే అధికారులు దృష్టిపెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా సికింద్రాబాద్‌నుంచి మహారాష్ట్రలోని బల్లార్ష వెళ్లే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, హైరా ఎక్స్‌ప్రెస్‌లను మౌలాలి రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు. అప్పటికే పలు మార్గాల్లో రైల్వే స్టేషన్లకు చేరుకున్న ప్రయాణీకులు రైళ్లు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మరోవైపు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కిలోమీటర్ దూరం వరకు బస్సులను అనుమతించకపోవడంతో ప్రయాణీకులు నడుచుకుంటూ వెళ్తూ కన్పించారు. విజయవాడ-సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఘట్‌కేసర్‌లో నిలిపివేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నెలకొన్న ఆందోళనలు, విధ్వంసం నేపథ్యంలో అప్రమత్తమైన మెట్రో రైల్ అధికారులు రద్దు చేశారు. మియాపూర్‌నుంచి సికింద్రాబాద్ వళ్లే ప్రయాణీకులు తీవ్ర ఆందోళన తెలిపారు. దీంతో పలు మెట్రో స్టేషన్లలో ఉద్రిక్తత తలెత్తింది. ప్రధానంగా ఉదయంనుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రైళ్లు రద్దయిన విషయం తెలియక రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పలువురు పిల్లా పాపలతో నానా ఇబ్బందులకు గురయ్యారు. ఆర్పీఎఫ్ పోలీసులు ప్రయాణీకులను స్టేషన్‌లోకి అనుమతించకపోవడంతో రోడ్లపై పడిగాపులు కాశారు. రైళ్‌ల రాకపోకలపై, ఎప్పుడు పునరుద్దరిస్తారన్న సమాచారంలో స్పష్టతలేకపోవడంతో ఆయోమయానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో రైల్వే వాఖ 040 27786666 నెంబర్‌తో హెల్ప్‌లైన్‌ను అందుబాటులో ఉంచింది.
ఉదయంనుంచి చెలరేగిన అగ్నిపథ్ ఆందోళణల కారణంగా నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కల్గింది. పలువురు రైల్వే స్టేషన్లలో చిక్కుకుపోవడంతో ఏం జరుగుతందో తెలియక ఆయోమయానికి గురయ్యారు. ఒక్కసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌లో జరిగిన ఆందోళన కారణంగా ప్రయాణీకులు అక్కడినుంచి బైటికి పరిగెత్తుకొచ్చారు. కొందరు తమ లగేజీలను అక్కడే వదిలేయగా, మరికొందరు అక్కడి రైళ్లలోనే తమ వస్తువులు, లగేజీని వదిలేసి బైటకి వెళ్లారు. ఈ క్రమంలో ఏం జరుగుతందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందని ప్రయాణీకులు తెలిపారు.
దూరపు ప్రాంతాలకు వెళ్లాల్సిన కొందరు రైల్వే స్టేషన్‌లోనే చిక్కుకుపోగా, మరికొందరు బస్సుల్లో తమతమ గమ్యస్థానాలకు బయల్దేరి వెళ్లారు. నగరంలోని అనేక ప్రాంతాల్లో బస్సులు నిల్చిపోవడంతో ప్రత్యామ్నాయ రవాణా వ్యవస్థ లేకుండా పోయింది. దీంతో రాష్ట్రమంతటికి ప్రయాణాలు నిల్చిపోయాయి. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ప్రయాణీకులు రహదారులపై పడిగాపులు కాస్తూ కన్పించారు. రైల్వే స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, పేవ్‌మెంట్లపై సేద తీరుతూ కన్పించారు.
కొందరికి కనీసంగా తాగేందుకు మంచినీళ్లు కూడా దొరకకపోవడంతో ఆవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒకవైపు ఉదయమంతా ఎండలు, సాయంత్రం వర్షంతో ప్రయాణీకులు అనేక కష్టాలకు గురయ్యారు. దూరప్రాంత ప్రయాణీకులు శుక్రవారం రాత్రి వరకు కూడా ఎక్కడికక్కడే చిక్కుపోయారు.