Friday, November 22, 2024

జర్నలిస్టులు ‘కోర్‌’ విలువలు పాటించాలి.. సెక్రెటరియేట్​లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గది: కవిత

జర్నలిస్టులు ‘కోర్‌’ విలువలు పాటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో మహిళా జర్నలిస్టుల కోసం నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాప్‌ ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్‌లో ‘సీ’ అంటే క్రెడిబిలిటీ, ‘ఓ’ ఆబ్జెక్టివీటీ (విషయం), ‘ఆర్’ రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ‘ఈ’ ఎతిక్స్ (విలువలు) ఉంటేనే.. ఆ వార్తకు సంపూర్ణత్వం వస్తుందన్నారు. ఒక వ్యక్తి గురించి రాసే ముందు ఆ వ్యక్తి అభిప్రాయం తెలుసుకునే మర్యాద ఉండాలన్నారు.

సీఎం కేసీఆర్‌తో మాట్లాడి కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్‌లో మహిళా జర్నలిస్టులకు ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌తో మాట్లాడి మీడియా సంస్థల్లో మహిళలపై వేధింపులు, వివక్షను నిరోధించేందుకు కమిటీలను వేయించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సంబంధించిన కమిటీల్లో మహిళలకు ప్రాతినిథ్యం ఉండేలా చూడాలని అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణకు విజ్ఞప్తి చేశారు.

వరంగల్‌లో ఓ మహిళా జర్నలిస్టు చికిత్సకు రూ.75లక్షలు ఖర్చు చేసి 11 ఆపరేషన్లు చేయించిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానికి ఉందని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి రూ.100కోట్లు ప్రకటించి, ఇప్పటి వరకు రూ.42కోట్లు దానిపై వచ్చిన వడ్డీతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.లక్ష సహాయం, కుటుంబానికి ఐదేళ్ల పాటు రూ.3వేల పెన్షన్‌, పిల్లల చదువులకు నెలకు రూ.వెయ్యి చొప్పున సంక్షేమ నిధి నుంచి మీడియా అకాడమీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు.

కొవిడ్‌ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 4వేల మంది జర్నలిస్టులకు రూ.6కోట్ల ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. మహిళా జర్నలిస్టులు ఎవరైనా తన న్యాయమైన గొంతును వినిపిస్తే దాన్ని ఆపడానికి ‘టెక్‌ ఫాక్స్‌’ ద్వారా దానికి వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్లు చేసిన అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఇది దురదృష్టకరమన్నారు. మహిళా జర్నలిస్టులకు మగవారికున్న స్వేచ్ఛ, వెసులుబాటు లేకున్నా పట్టుదలతో ప్రతి అడ్డంకిని అధిగమించి విధులు నిర్వర్తిస్తే మంచి గుర్తింపు వస్తుందని మండలి సభ్యురాలు వాణిదేవి అన్నారు. తన తండ్రి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు అన్ని పాత్రలు తానే పోషించి పత్రికను నడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement