Saturday, November 23, 2024

ఢిల్లీ ఎయిర్ పోర్టులో- జర్నలిస్టు సనా ఇర్షాద్ కి అవమానం

జర్నలిస్టుకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం ఎదురైంది. న్యూయార్క్‌ వెళ్లకుండా మహిళా జర్నలిస్టును ఎయిర్‌పోర్ట్ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. ఎలాంటి కారణాలు తెలపకుండానే తనను అడ్డుకున్నారని పులిట్జర్‌ అవార్డు గ్రహీత జర్నలిస్ట్‌ విచారం వ్యక్తం చేసింది. ఢిల్లీలో తనకి అవమానం ఎదురయిందని.. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఆమెపై విధించిన ఆంక్షల కారణంగా ఇమ్మిగ్రేషన్‌ వద్ద అడ్డుకోవాల్సి వచ్చిందని అధికారులు చెప్తున్నారు. ఈ ఏడాది మే నెలలో కొవిడ్-19 సమయంలో కవరేజ్ చేసిన నలుగురు భారతీయ ఫొటో జర్నలిస్టులకు పులిట్జర్ ప్రైజ్ దక్కింది. వీరిలో ఈమె కూడా ఒకరు.

జమ్ముకశ్మీర్‌ రాష్ట్రానికి చెందిన ఫొటోజర్నలిస్ట్‌ సనా ఇర్షాద్‌ మట్టూ.. పులిట్జర్‌ అవార్డును అందుకునేందుకు న్యూయార్క్‌ వెళ్లేందుకు సిద్ధమైంది. న్యూఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లగా.. అక్కడి ఇమ్మిగ్రేషన్‌ విభాగం వద్ద అధికారులు ఎలాంటి కారణం చెప్పకుండానే అడ్డుకున్నారు. తనకు చెల్లుబాటయ్యే అమెరికా వీసా, టికెట్‌ ఉన్నాయని చెప్పినా వినకుండా ఆమెను విమానం ఎక్కకుండా అడ్డగించారు. అధికారులతో ఎంత వాదన చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో ఉసూరుమంటూ ఆమె వెనుదిరిగారు. ఢిల్లీ విమానాశ్రయంలో విదేశాలకు వెళ్లకుండా ఈమెను అడ్డుకోవడం ఇది రెండోసారి. ఇంతకు ముందు జూలై నెలలో కూడా ప్యారిస్‌ వెళ్లకుండా నిషేధించారు. పులిట్జర్ ప్రైజ్ అందుకోవడానికి న్యూయార్క్ వెళ్తున్నాను. ఢిల్లీ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ వద్ద నన్ను ఆపారు. నా దగ్గర సరైన అమెరికా వీసా, టిక్కెట్ ఉన్నాయి. అయినప్పటికీ నన్ను విదేశాలకు వెళ్లడానికి అనుమతించలేదు’ అని జర్నలిస్ట్ సనా ఇర్షాద్ సోషల్ మీడియాలో రాశారు. ఎలాంటి కారణంగా లేకుండా తనను ఆపడం ఇది రెండోసారి అని ఆమె పేర్కొన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement