సూర్యాపేట జిల్లా గుర్రంపోడు తండా దాడి ఘటనకు సంబంధించిన కేసులో జర్నలిస్ట్ రఘును పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయనను..మఫ్తీలో వచ్చిన పోలీసులు మల్కాజిగిరిలో అరెస్ట్ చేశారు. రఘు రోడ్డుపై నిలబడి ఉండగా కొందరు వ్యక్తులు రఘుని బలవంతంగా కారులో ఎక్కించారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే పోలీసులు రఘును అరెస్ట్ చేసిన తీరును కాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. ఆ వీడియోను ట్వీట్ చేసిన దాసోజు శ్రవణ్.. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఇదేనా అని తెలంగాణ డీజీపీని ప్రశ్నించారు.
‘దీన్ని కిడ్నాప్ అంటారా లేక అరెస్ట్ అంటారా? వీళ్లు పోలీసులా లేక గులాబీ గూండాలా? ఇదేం రాజ్యం? ఒక జర్నలిస్ట్‌పై ఇంత దారుణం ఎందుకు? నోటీసు ఇచ్చి అరెస్ట్ చేయవచ్చు కదా? నిరంతరం ఫ్రెండ్లీ పోలీసు గూర్చి తపించే తెలంగాణ డీజీపీ గారు.. ఈ పోలీసులపై మీరు ఏంచర్య తీసుకుంటారు?’ అని శ్రవణ్ ప్రశ్నించారు.