ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజే చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు జనరల్ మనోజ్ పాండే. తనకు దేశ రక్షణే ఫస్ట్ ప్రయారిటీ అని అన్నారు. ఎలాంటి సవాల్ అయినా ఎదుర్కోడానికి రెడీగా ఉన్నానని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. జనరల్ మనోజ్ పాండే ఆదివారం గార్డ్ ఆఫ్ హానర్ అందుకున్నారు. దీంతో ఆయన కొత్త బాధ్యతలు ప్రారంభమయ్యాయి. కాగా, ఆయన ఓ జాతీయ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా జనరల్ మనోజ్ పాండే మాట్లాడుతూ.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. భారత్ చైనా మధ్య చర్చలు నడుస్తున్నాయని గుర్తు చేశారు. ఈ చర్చల ద్వారా ఓ మార్గం కూడా దొరుకుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎల్ఏసీ వేదికగా తప్పుడు చర్యలు చేస్తే మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదని చైనాను హెచ్చరించారు.
ప్రస్తుతమున్న యథాతథ స్థితికి వ్యతిరేకంగా ఏం చేసినా ఊరుకునేది లేదని జనరల్ మనోజ్ పాండే తీవ్రంగా హెచ్చరించారు. అలాగే భారత్‌కు సంబంధించిన ఒక్క ఇంచు భూమిని కూడా వదులుకోబోమని కూడా అంతే స్థాయిలో తేల్చి చెప్పారు. చైనాతో చర్చలు జరపడం ద్వారానే ఓ పరిష్కారం కనుగొంటామని ఆర్మీ చీఫ్ అభిప్రాయపడ్డారు. చైనా సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించామని, లద్దాఖ్‌లో ముందున్న పరిస్థి తీసుకురావాలన్నదే తమ ప్రయత్నమని ఆయన పేర్కొన్నారు. భారత ఆర్మీ సర్వసమర్థవంతమైన ఆర్మీ అని, దేశ భూభాగ విషయంలో గానీ, మరే ఇతర విషయాల్లోనూ నష్టపోకుండా చూసుకుంటామని స్పష్టం చేశారు.