మరో 9 రోజుల్లో ఐపీఎల్ టోర్నీ ప్రారంభం కానుంది. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే వివిధ జట్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. బయోబబుల్‌లో రెండు నెలల పాటు గడిపేందుకు ఇష్టం లేక ఇప్పటికే సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ దూరం కాగా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కూడా కీలక బౌలర్ హేజిల్ వుడ్ దూరమవుతున్నాడు. ఈ మేరకు అతడు ఓ ప్రకటన విడుదల చేశాడు.
‘దాదాపు 10 నెలల నుంచి బయో బబుల్, క్వారంటైన్‌లోనే జీవితాన్ని గడుపుతున్నాను. ఐపీఎల్ తర్వాత కూడా బిజీ క్రికెట్ షెడ్యూల్లో ఆడబోతున్నాం. గత ఏడాదిగా విశ్రాంతి లేకుండా ఒక సిరీస్ నుంచి మరొక సిరీస్ ఆడుతూనే ఉన్నాం. దీని కారణంగా మానసికంగా, శారీరకంగా అలసటగా భావిస్తున్నాను. అందుకే ఐపీఎల్ నుంచి తప్పుకుని కుటుంబంతో గడపాలని అనుకుంటున్నా’ అని హేజిల్‌వుడ్ చెప్పాడు. ఐపీఎల్ 2020 వేలంలో హేజిల్‌వుడ్‌ను CSK రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. గత సీజన్‌లో మూడు మ్యాచులు ఆడిన హేజిల్‌వుడ్ ఒకే ఒక్క వికెట్ తీశాడు. ప్రస్తుతం లీగ్ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన ఈ పేసర్ నిర్ణయం నిస్సందేహంగా సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ అనే చెప్పాలి.