ధర్మసాగర్, (ప్రభన్యూస్) : హన్మకొండ జిల్లాలో మిషన్ భగీరథ పైప్‌లైన్ దెబ్బతింది. ధర్మసాగర్ మండలం జానకిపురంలో ఈ ఘటన జరిగింది. దేవాదుల పైప్ లైన్ భూమిలో నుండి ఒక్కసారిగా భూమిని చీల్చుకుంటూ పైకి లేవడంతో గ్రామస్తులు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గ్రామంలో నుండి దేవాదుల పైప్ లైన్ లు భూమిలో నుండి రెండు లైన్ లు వేశారు. నిన్న (మంగళవారం) రాత్రి కురిసిన వర్షానికి పైప్ లైన్ జాయింట్ ఊడిపోయి, పైకి వచ్చింది.
ఇప్పటికే ఒక పెద్ద పైపు నుంచి నీళ్లు లీక్ అవుతుండగా, ఇప్పుడు మరో పైపు కూడా ఇట్లా జాయింట్ ఊడిపోయి పైకి రావడంతో ఆందోళన చెందుతున్నారు. అయితే అందులో నీళ్లు లేకపోవడంతో గ్రామస్తులు, రైతులు ఊపిరిపీల్చుకున్నారు. లేకపోతే నాట్లు వేసిన రైతులకు బాగా నష్టం జరిగేది. పైప్ లైన్ పై మట్టి లేకపోవడంతోనే ఇట్లా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. దీనిపై అధికారులు త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.