అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చాలాసార్లు నాలిక మడతపడి తప్పులు మాట్లాడి నవ్వలు పాలవుతున్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి పెద్ద తప్పు మాట్లాడేసి అభాసుపాలయ్యారు. ఈ ఘటన ‘ఈక్వల్ పే డే’ కార్యక్రమంలో వెలుగు చూసింది. ఈ కార్యక్రమానికి అమెరికా ఉపాద్యక్షురాలు కమలా హ్యారిస్ రాలేదు. ఆమె భర్త డోగ్ ఎమాఫ్‌కు కరోనా సోకినట్లు తేలడంతో కమల.. ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ విషయాన్ని వెల్లడించిన బైడెన్.. ‘‘ఈ స్టేజిపై ఎవరుండాలనే విషయంలో చిన్న సర్దుబాటు జరిగింది. ఫస్ట్ లేడీ భర్తకు కరోనా సోకడంతో ఈ మార్పు తప్పలేదు’’ అని చెప్పుకుంటూ పోయారు. ఈ క్రమంలో బైడెన్ ఏం మాట్లాడుతున్నారనే విషయాన్ని.. తను చేసిన తప్పు కూడా గుర్తించలేదు.
కాగా, ఆయన ఉపన్యాసం వినడానికి వచ్చిన ప్రేక్షకుల్లో ఒకరు ఈ తప్పును ఎత్తిచూపారు. దాంతో సభలోని వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. దీంతో బైడెన్ కూడా నవ్వుతూ.. ‘‘అవును. తను బాగానే ఉంది’’ అంటూ తన భార్య జిల్ బైడెన్‌ను చూపించారు. ‘‘సెకండ్ లేడీ.. ఏమంటారు?’’ అంటూ తనను తాను కరెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత ఉపన్యాసం కొనసాగిస్తూ ‘‘నేను జోబైడెన్. జిల్ బైడెన్ భర్తను అయినందుకు చాలా గర్వపడుతున్నాను’’ అని అన్నారు. ఆ తర్వాత ‘ఈక్వల్ పే డే’ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. కాగా, ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక పార్టీలో పాల్గొన్న ఎమాఫ్‌కు కరోనా సోకినట్లు వైట్‌హౌస్ వర్గాలు ధ్రువీకరించాయి. అదే సమయంలో కమలకు నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు తెలిపారు.