Monday, November 18, 2024

J&K – మంచు లోయలో పొలిటికల్ హీట్ … గెలుపు కోసం పార్టీల ఫీట్

ఏ ఎలక్షన్ సీజన్ వచ్చినా.. ఏ రాష్ట్ర‌మైనా.. స్థానిక వేష భాషతో ఆకట్టుకునే దేశ ప్రధాని మోదీ మరో సంచలనాత్మక చరిత్రాత్మక పర్యటనకు బయలుదేరారు. 42 ఏళ్ల కశ్మీర్ చరిత్రను తిరుగరాస్తున్నారు. హిందూ నినాదం.. జాతీయ ఆయుధం చేత‌ప‌ట్టుకుని కశ్మీర్ సామ్రాట్టుల పాలనకు చరమ గీతం పాడేందుకు సర్వసన్నద్ధం అయ్యారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి.. స్వ‌తంత్ర‌త తెచ్చారు. పండిట్ల రాజ్య స్థాపనకు యుద్ధ భేరీ మోగించారు. ఇప్పుడు నయా కశ్మీర్ ధ్రువతారను ఆవిష్కరించే యజ్ఞం ఆరంభించారు. ఇక‌.. స్వయం ప్రతిపత్తిని కోల్పోయిన కశ్మీరంలో ప్రస్తుత పొలిటికల్ సినారియోను ప‌రిశీలిస్తే అక్క‌డి ప్ర‌జ‌ల్లో నిరాశే క‌నిపిస్తోంది. గత అసెంబ్లీలో మిత్రపక్షం.. పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ ప్రస్తుతం శత్రువుగా మారింది. చిరకాల మిత్రులైన‌ కాంగ్రెస్, నేషనల్ పార్టీ ఈ ఎన్నిక‌ల్లో విజయం కోసం జ‌ట్టుకట్టాయి. ఎన్డీఏ ఎజెండాతో చిన్నచితకా పార్టీలతో జట్టుకట్టిన కాషాయ పార్టీకి.. డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ దిక్కుగా మార‌నుంది. నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్న‌ డీపీఏపీ నేతలు యుద్ధానికి వెనుక వరసలో నిలబడ్డారు. కాగా, కశ్మీర్ లోయలో బ‌రిలోకి దిగేందుకు బీజేపీకి నేతలే లేరు. ఇట్లాంటి సిచ్యుయేష‌న్‌లో ప్రధాని మోదీ క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న వెనుకు ఉన్న ఆంత‌ర్యం ఏమిటి? రాజకీయ వ్యూహం ఏంటి? అనేద దానిపై ప‌లు ఊహాగానాలున్నాయి.

ఆంధ్రప్రభ స్మార్ట్, శ్రీనగర్ :జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ యుద్దం ఆరంభమైంది. త్వరలో జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని అధికార బీజేపీకి సంకటంగా మారాయి. ఆర్టికల్ 370 రద్దు చేశాం. కశ్మీర్‌లో ఉగ్రవాదం మట్టి కరిచింది. దేశభక్తి ప్రజ్వరిల్లుతోంది. ఇందుకు కారణం.. మోదీ సర్కారు జాతీయ భావం. హిందూ ధర్మ రక్షణ బలమైన పునాది పడింది. ఇక కశ్మీర్ లో పండిట్ల రాజ్య స్థాపన ఆలస్యమని బీజేపీ గొప్పలు పోతోంది. కానీ, వాస్తవ స్థితిలో ఇక్కడ జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేయటం లేదు. అసలు పోటీకి అభ్యర్థుల దొరకటం లేదు.

ప్రధానంగా ముస్లింల ప్రభావం ఎక్కువగా ఉండే క‌శ్మీర్ లోయలో కనీసం సగం సీట్లలో కూడా పోటీ చేయడం లేదు. కాషాయం పార్టీ గొంతులో కషాయం ఉక్కిరిబిక్కరి చేస్తోంది. జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో మొత్తం 90 సీట్లున్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉంటే కశ్మీర్ లోయలో మాత్రం 47 సీట్లున్నాయి. ఇందులో జమ్మూ ప్రాంతంలోని 43 సీట్లకు అభ్యర్ధుల్ని బీజేపీ ప్రకటించింది. కశ్మీర్ లోయకు వచ్చే సరికి కేవలం 19 సీట్లకే అభ్యర్ధుల్ని ప్రకటించింది. అంతే కాకుండా ఇక్కడ మిగతా సీట్లలో పోటీ చేయడం లేదని కూడా తేల్చిచెప్పేసింది.

- Advertisement -

అంటే.. కశ్మీర్ లోయలో పోటీకి బీజేపీ ఎందుకు అంత భయపడుతుందనే చర్చ జరుగుతోంది.

ఎన్నిక‌ల సార‌థిగా తెలంగాణ నేత కిష‌న్‌రెడ్డి..

జమ్మూలో 43 సీట్లు, కశ్మీర్ లోయలో 19 సీట్లూ కలిపితే బీజేపీ ఈ ఎన్నికల్లో మొత్తం 62 సీట్లలో మాత్రమే బీజేపీ పోటీ చేస్తోంది. మిగిలిన 27 సీట్లపై ఆశలు వదులుకుంది. ఆ 27 సీట్ల సంగతి పక్కనబెడితే ప్రస్తుతం అభ్యర్ధుల్ని నిలబెట్టిన 19 సీట్లలోనూ గెలుపు ఆశల్లేవని కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక్కడ కేవలం డమ్మీ అభ్యర్ధులుగానే నిలబెట్టినట్లు బీజేపీ అంతర్గత చర్చల్లో వ్యక్తమవుతోంది.

మరి జమ్మూకశ్మీర్ లో అధికారం సాధించడం ఎలా? జమ్మూలో అభ్యర్ధుందరూ గెలవాలి. లేక పోతే మ్యాజిక్ ఫిగర్ అవసరమైన స్వతంత్రులకు గాలం వేయాలి. ఇక తెలంగాణ‌ నేత కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి ఇక్కడ బీజేపీ ఎన్నిక‌ల సారధిగా వ్యవహరిస్తున్నారు.

కమలనాథులకు క‌త్తిమీద సాము..

ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీరీయుల మదిని బీజేపీ ఆకట్టుకుందా? లేదా! అన్న అంశంపైనే జనం తీర్పు నిర్ణయిస్తుంది. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్‌లో జరుగుతున్న తొలి ఎన్నికలు కావడంతో మోదీ పాలనకు రెఫరెండంగా మార‌నుంద‌ని అన‌లిస్టులు భావిస్తున్నారు. కేంద్రంలోని మోదీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయానికి జమ్మూ కశ్మీర్ ఎన్నికల ఫలితాలు రెఫరెండం అవుతాయని వ్యాఖ్యానిస్తున్నారు.

రాజకీయ కారణంతో ఆర్టికల్ 370కి కాంగ్రెస్ మద్దతు ఇచ్చినప్పటికీ, జమ్మూ క‌శ్మీర్ స్వయంప్రతిపత్తి రద్దును కాంగ్రెస్ మిత్రపక్షం నేషనల్ కాన్ఫరెన్స్ పూర్తిగా వ్యతిరేకించింది. మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ పీడీపీ ఎక్కడ వెనక్కి తగ్గటం లేదు. ప్రస్తుతం, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) నాయకురాలు మెహబూబా ముఫ్తీతో సహా అన్ని రాజకీయ పార్టీలు కేంద్రంలోని అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయి.

ఎన్సీతోనే కాంగ్రెస్ పార్టీ.

.ప్రస్తుతం కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ జత కలిసి ఈ ఎన్నికల్లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వనున్నాయి. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ 51 స్థానాల్లో పోటీ చేయనుండగా, జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌ బీజేపీతో తలపడనుంది.

పొలిటకల్ మాస్టర్‌ స్ట్రోక్‌

హిందువుల అత్యధిక మెజారిటీ జమ్మూలో సీట్ల సంఖ్యను ప్రధాని మోదీ సర్కారు 37 నుంచి 43 సీట్లకు పెంచింది. డీలిమిటేషన్ కసరత్తులో భాగంగా లోయలో ఒక సీటు మాత్రమే జోడించింది. ఇక్కడ స్థానాల సంఖ్య 46 నుంచి 47కు పెరిగింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి 19.3 శాతం ఓట్లు రాగా, నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు 22.2 శాతం ఓట్లు వచ్చాయి. పార్లమెంట్ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, కాంగ్రెస్‌ పార్టీలు కలిసి మొత్తం 90అసెంబ్లీ స్థానాల్లో 46 సెగ్మెంట్లలో ఆధిక్యంలో నిలిచాయి.

బీజేపీ, దాని మిత్రపక్షం పీపుల్స్ కాన్ఫరెన్స్ 30 అసెంబ్లీ స్థానాల్లో ఆధిక్యంలో నిలిచాయి. జమ్మూ కశ్మీర్ పీసీసీ అధ్యక్షుడిగా పీడీపీ మాజీ నేత తారిఖ్ హమీద్ కర్రాను ఇటీవల కాంగ్రెస్ నియమించింది. జమ్మూ ప్రాంతంలోని 43 స్థానాల్లో గెలుపు అవకాశాలపై కన్నువేసి ఇద్దరు హిందువులు తారా చంద్, రామన్ భల్లాలను జమ్మూ కశ్మీర్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రంగంలోకి దించింది.

లోయలో నేషనల్ కాన్ఫరెన్స్ బాగా రాణిస్తుందని అంచనా వేసినప్పటికీ, సీట్ల సంఖ్యను పెంచుకోవడంతోపాటు జమ్మూలో బీజేపీ ఓటు బ్యాంకును దెబ్బతీయడం కాంగ్రెస్ ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్లో పార్టీ కోసం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అలాగే ప్ర‌ధాని మోదీ సైతం మంచుకొండ‌ల‌లో ప్ర‌చార శంఖ‌రావం పూరించారు..

గులాం నబీకే బీజేపీ సలాం కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్ నాయకుడు, ప్రముఖ రాజకీయ నేత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీని స్థాపించారు. డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) పేరుతో తన కొత్త రాజకీయ స్టాల్ ని ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్క్రమించడంతో ఒక విధంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బే ప్రస్తుతం గులాం నబీ ఆజాద్ తన అనారోగ్యంతో ఎన్నికల ప్రచారానికి దూరం కావటంతో.. ఆయన వ్యవస్థాపిత డీపీఏపీ అభ్యర్థులు గుండెల్లో నీరు గారిపోయింది. చాలామంది పోటీ నుంచి ముందుగానే వైదొలిగారు.

రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆజాద్ డీపీఏపీ అద్భుత ఫలితాలు సాధిస్తే ఆయన పార్టీకి బీజేపీ మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కానీ, లోక్‌సభ ఎన్నికలలో తమ అభ్యర్థులందరూ ఓడిపోవడంతో ఆజాద్ పార్టీ ఇప్పటి వరకు టేకాఫ్‌లో విఫలమైంది.

బీజేపీ ఓడితే… గవర్నర్ పాలనే

జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం రాజకీయపరంగా ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా కల్పించడంలో బీజేపీ జాప్యం చేయదు. కమలం పార్టీ ఓడిపోతే మాత్రం కేంద్ర పాలిత ప్రాంతం లెఫ్టినెంట్- గవర్నర్ ద్వారా నేరుగా కేంద్రం పరిపాలనలో కొనసాగే అవకాశం ఉంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్-గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇటీవల పలు నిబంధనలను సవరించింది.

.జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం రాజకీయపరంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకం. ఒకవేళ విజయం సాధిస్తే బీజేపీ జమ్మూకాశ్మీర్లో బలోపేతానికి మార్గం సుగమం అవుతుంది. కాంగ్రెస్‌ పార్టీకి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో జరిగే ఏ ఎన్నికల్లోనైనా గెలవడం ఆపార్టీకి నైతిక స్థైర్యాన్ని నింపుతుంది. జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి గెలిస్తే అది కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీన పడుతున్నదనే సంకేతంగా మారవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement