కాశ్మీర్ లోయ.. భువిపై అందచందాల సీమ. ఆకాశాన్నంటే పచ్చని తరులు. చందమామను ముద్దాడే గిరులు.. భూమాత చుంభనం కోసం నేలకొరిగిన హరివిల్లు లెక్కన రంగురంగుల పూలవనాలతో మదిని మైమరపించే ఈ లోయ.. ప్రస్తుతం రక్తధారల సెలయేళ్లకు అలవాలమైంది. అక్కడికి అడుగుపెట్టినవారి గుండెల్లో ఆ వ్యథ.. భయం వర్ణనాతీతం.. కాశ్మీర్‌లో ఆదివారం ఓ బస్సుపై ఉగ్రమూకల దాడి ఘటనలో తుపాకీ తూటాలకు పదిమంది పిట్టల్లా రాలిపోయారు. మిగిలిన ప్రయాణికులు ప్రాణాలు గుపెట్లో పెట్టుకుని క్షణ క్షణం నరకయాతన అనుభవించారు. కళ్లముందే బస్సు లోయలోకి దూసుకుపోయింది. ఇక చచ్చిపోయామని కళ్లు మూసి తెరచే లోపు.. 33 మంది గాయాలతో చావుకేకలు పెడుతుంటే.. ఆ బుల్లెట్ల శబ్ధంలో కనీసం వినపడని స్థితి అది. అసలు బతుకుతారో లేదో తెలీదు. ప్రాణం ఉన్నంత వరకూ తమను తామే కాదు.. తమ బంధువులనూ కాపాడుకోవాలని తపించిపోయిన వైనం ఇది.
సీన్ కట్ చేస్తే..
ఆదివారం ఉదయం శివఖోరి నుంచి కాట్రాకు 41 మందితో బస్సు బయలు దేరింది. మరో గంటలో వైష్ఱోదేవీ ఆలయానికి చేరుతుంది. లోయలో కశ్మీరం అందచందాలను చూస్తూ ప్రయాణికులు పరవశించి పోతున్నారు. బస్సు రియాసీ ప్రాంతానికి చేరుకుంది. అంతే అనుకోకుండా బుల్లెట్ల వాన ఆరంభమైంది. బస్పులో జనం బిక్కచచ్చిపోయారు. బస్సును ఆపాలని గొడవ మొదలెట్టారు. బస్సు ఆపితే అందరం చచ్చిపోతాం.. సీట్ల కిందకు దాక్కోవాలని డ్రైవరు వార్నింగ్ ఇచ్చాడు. ఇంతలో బుల్లెట్టు తగిలింది. డ్రైవరు కంగుతిన్నాడు. బస్సు అదుపు తప్పింది. లోయలోకి జారిపోయింది. అంతే చావు కేకలు మార్మోగాయి. పదిమంది నోట మాట లేదు. శరీరాల్లో బుల్లెట్లు దిగి రక్తం చిందింది. మిగిలిన ప్రయాణికులూ.. గాయపడినోళ్లు గావు కేకలు పెడుతుంటే.. మిగిలినోళ్లు క్షణ క్షణం అల్లాడిపోయారు. దాదాపు 25 నిముషాలపాటు సాగిన ఈ బుల్లెట్ల వర్షం ఆగిపోయింది. ఎవరు చచ్చిపోయారు? ఎవరు గాయపడ్డారు? ఎందరు బతికారో తెలియదు. కానీ, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగ్రాత్రులను ఆసుపత్రికి తరలించారు
అర గంట జీవన పోరాటం
ఈ రాక్షస ఉగ్రదాడిలో బతికి బట్ట కట్టిన మృత్యుంజయుల్లో ఢిల్లీకి చెందిన ఓ కుటుంబం నరకయాతన వర్ణనాతీతం. ఢిల్లీకి భవానీ శంకర్ ఆ బస్సులోనే ప్రయాణించారు. తమ పెళ్లిరోజు సందర్భంగా తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి వైష్ణవోదేవి ఆలయ దర్శనం కోసం భవానీ శంకర్ బయలుదేరారు. రియాసి జిల్లాలోని శివ కోహరి ఆలయానికి వెళ్తున్న సమయంలో బస్సుపై కాల్పుల మోత మోగింది.టెర్రరిస్టుల కాల్పులతో బుల్లెట్లు దూసుకొస్తున్న ఆ క్షణంలో.. తాము ముందుకు వంగిపోయామని, తన ఇద్దరు పిల్లల్ని బస్సు సీటు కింద దాచిపెట్టామని శంకర్ తెలిపారు. దాదాపు 20 నుంచి 25 నిమిషాల పాటు బుల్లెట్ల వర్షం కొనసాగిందని, ఆ భయానక పరిస్థితుల్ని ఎన్నటికీ మరిచిపోలేనని చెప్పారు. భవానీ శంకర్‌తో పాటు ఆయన భార్య, ఇద్దరు పిల్లలు గాయపడ్డారు. వాళ్లు జమ్మూకశ్మీర్‌లోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కూతురు దీక్షా రాఘవ్, మూడేళ్ల కుమారుడు రాఘవ్‌తో పాటు భార్య రాధా దేవి ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు.