తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పాత్రపై పోలీసులు ఆరా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి స్పందించారు. ఢిల్లీలోని నివాసం నుంచి తనను కిడ్నాప్ చేసేందుకు కొంతమంది గూండాలు యత్నించారని.. నేడు మహబూబ్ నగర్‌లోని నివాసంపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడిలో తన కారు ధ్వంసం అయిందన్నారు. ఇల్లు తగుల బెట్టేందుకు ప్రత్నించారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ పుటేజీని జింతెందర్‌రెడ్డి ట్వీట్ చేశారు. మహబూబ్‌నగర్ పోలీసులకు, డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాల్సి ఉందన్నారు. సీబీఐతో దర్యాప్తు చేయించాలని.. ఒకవేళ టీఆర్ఎస్ సర్కారుకు సీబీఐపై నమ్మకం లేకపోతే న్యాయ విచారణ అయినా జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి రాజకీయాల్లో కొనసాగుతున్న తనపై ఇప్పటిదాకా చిన్న మచ్చ కూడా లేదని చెప్పిన జితేందర్ రెడ్డి.. మహబూబ్ నగర్ నుంచి ఎవరు ఢిల్లీ వచ్చినా తాను ఆశ్రయమిస్తానని కూడా చెప్పారు. తెలంగాణ కోసం ఉద్యమించిన వారికి ఆశ్రయం ఇచ్చి తీరాల్సిందేనని ఆయన చెప్పారు. తన ఇంటిలో ఆశ్రయం పొందాడని చెబుతున్న మున్నూరు రవి ప్రతి వారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌నూ కలుస్తుంటాడని కూడా జితేందర్ రెడ్డి చెప్పారు.
కాగా, మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర చేసిన వారిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిలో మున్నూరు రవి అనే వ్యక్తి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి చెందిన ఢిల్లీ నివాసంలో ఆశ్రయం పొందాడని పోలీసులు తెలిపారు. నిందితుడు రవిని పోలీసులు అక్కడే అరెస్ట్ చేయడంతో మంత్రి హత్యకు జరిగిన కుట్రలో జితేందర్ రెడ్డితో పాటు బీజేపీకి చెందిన మహిళా నేత డీకే అరుణల పాత్రపైనా దర్యాప్తు చేపట్టనున్నట్లుగా సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్న సంగతి తెలిసిందే.