అమరావతి: గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఆ పేరు మార్చకపోతే తాము అధికారంలోకి వచ్చాక మార్చేస్తామని చెప్పారు. రాజమహేంద్రవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్ ఆర్థర్ కాటన్‌తో పాటు ధవళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకపాత్ర పోషించిన వీరన్న అనే ఇంజినీర్‌నూ స్మరించుకోవాలన్నారు.
విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్) పేరునూ మార్చాలంటూ సోము వీర్రాజు కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. కింగ్ జార్జ్ పేరెందుకని.. తెన్నేటి విశ్వనాథం, గౌతు లచ్చన్న పేర్లు పెట్టుకోవాలన్నారు. చీప్ లిక్కర్ రూ.50కే ఇస్తామంటూ తాను చేసి వ్యాఖ్యలను సోము వీర్రాజు ఇవ్వాల సమర్థించుకున్నారు. అలా అమ్మితే కుటుంబానికి ఏడాదికి రూ.2లక్షలు మిగులుతాయని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని.. ప్రతి నియోజకవర్గంలో నిరుద్యోగులతో నాటు కోళ్ల ఫారాలు ఏర్పాటు చేస్తామన్నారు.