Tuesday, November 19, 2024

Breaking: జార్ఖండ్ గ్యాంగ్​ సైబర్ మోసం.. నారాయణపేట కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, సామాన్యుల వివరాలతో సైబర్ నేరగాళ్లు నకిలీ అకౌంట్స్‌ సృష్టించి వారి సంబంధీకుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా ఓ మోసగాడు ఏకంగా జిల్లా కలెక్టర్ పేరిట నకిలీ వాట్సాప్ అకౌంట్‌ సృష్టించాడు. గుర్తు తెలియని వ్యక్తి 8210616845 నెంబర్‌తో నారాయణపేట జిల్లా కలెక్టర్ హరిచందన ఫొటోతో వాట్సాప్ ప్రొఫైల్ సృష్టించాడు. దాన్నుంచి పలువురు ఉన్నతాధికారులు, ఇతరులకు మెస్సేజ్‌లు కూడా పంపించాడు. వీరి వ‌ల‌లో ప‌డ్డ జిల్లా స్థాయి మాజీ అధికారి.. అమెజాన్ పే యాప్‌నుంచి 2.40ల‌క్ష‌లు పంపించారు. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌కు ఫిర్యాదు చేశామని దీనిపై విచారణ చేస్తున్నట్లు ఎస్పీ ఎన్‌. వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు. ఈ నకిలీ వాట్సాప్ నంబర్‌తో నారాయణపేట జిల్లా యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదని, దాని నుంచి వచ్చే సందేశాలను ఎవరూ నమ్మవద్దని కలెక్టర్ హరిచందన ఒక ప్రకటనలో తెలిపారు. దీనినుంచి ఎవరికైనా సందేశాలు వస్తే పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు.

కలెక్టర్ ఫొటోతో నకిలీ ప్రొఫైల్ సృష్టించి డబ్బులు డ్రా చేసిన వ్యక్తి జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, ఈ విషయంపై విచారణ జరుగుతుందని ఎస్పీ తెలిపారు. అలాగే, ఇలాంటి వాట్సాప్ మెస్సేలు వ‌చ్చినా, ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ పిక్చర్ మార్చి ఉన్నతాధికారుల ఫొటోలు పెట్టి డబ్బులు కావాలని అడిగినా నమ్మొద్ద‌ని, ఒకసారి విచారణ చేసుకోవాలని సూచించారు. ప్రజలు వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, సోషల్ మీడియా మెసేజ్లకు స్పందించి డబ్బులు వేయకూడదని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

ఒకవేళ ఎవరైనా అడిగితే వెంటనే వారి వివరాలను పోలీసుల‌కు అంద‌జేయాల‌ని సూచించారు. సైబర్ నేరాలప‌ట్ల‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అలాగే, సైబర్ నేరాల నుంచి రక్షణ పొందేందుకు ఎన్‌సీఆర్‌పీ పోర్టల్ లో కంప్లైంట్ చేయాలని, టోల్ ఫ్రీ నెంబర్ 1930 కాల్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement