రాష్ట్రాలకు టీకాల పంపిణీపై కేంద్ర వైఖరిపై రోజురోజుకు అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమ రాష్ట్రానికి కరోనా టీకాలు ఉచితంగా పంపించాలని కోరుతూ జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. కరోనాతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న తమకు అది తలకు మించిన భారమవుతుందని వాపోయారు. అందువల్ల రాష్ట్రానికి టీకాలు పంపించి సహకరించాలని కోరారు. రాష్ట్రానికి అందుతున్న వ్యాక్సిన్లు ఏమాత్రం సరిపోవడం లేదని, ఇది వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అవరోధంగా మారిందని చెప్పారు.
రాష్ట్రంలో రాష్ట్రంలో 18-44 మధ్య వయస్సున్నవారిలో అర్హులైనవారు 1.57 కోట్ల మంది ఉన్నారని, వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు రూ.1100 కోట్లు ఖర్చవుతుందని, అంత భారీ మొత్తాన్ని భరించే స్థితి తమకు లేదని లేఖలో పేర్కొన్నారు. పరిమిత వనరులతో తాము కరోనా సెకండ్ వేవ్‌తో పోరాడుతున్నామని చెప్పారు. అది రాష్ట్రానికి భారంగా మారుతుందని పేర్కొన్నారు. దీంతోపాటు 12 నుంచి 18 ఏళ్ల వయసు గల పిల్లలకు టీకాలు వేయాలంటే మరో రూ.వెయ్యి కోట్లు అవసరమవుతాయని చెప్పారు.