తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్బంగా సీఎల్పీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, జేసీ దివాకర్‌రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం తప్పు చేసిందని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లిందని, సీఎం పదవి కోసం నేతలంతా కలిసి పోటీపడి కాంగ్రెస్ పార్టీని చంపేశారని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేల్చిచెప్పారు. అప్పట్లో రాయల తెలంగాణకు జైపాల్‌రెడ్డి మద్దతు ఇవ్వలేదని పేర్కొన్నారు.
కాగా చంద్రబాబుకు సీఐడీ నోటీసులు ఇవ్వడంపై జేసీ దివాకర్‌రెడ్డి స్పందించారు. మూడు నెలల కిందటే చంద్రబాబుకు నోటీసులు రావాల్సి ఉందని, తమ వీపు పగిలినప్పుడే చంద్రబాబుకు వీపు పగలాల్సి ఉందని.. కానీ ఎందుకు ఆలస్యమైందో అనుమానంగా ఉందని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు సీఐడీ అధికారులు నోటీసుల కింద ఒక్క పేజీ మాత్రమే ఇచ్చారని.. కానీ జగన్‌కు నోటీసులు ఇవ్వాల్సి వస్తే లారీల్లో పంపాల్సి ఉండేదని ఎద్దేవా చేశారు.