Monday, November 18, 2024

ప్ర‌తి స‌మ‌స్య‌కు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూనే కార‌ణ‌మా – బిజెపిపై మండిప‌డిన మ‌న్మోహ‌న్ సింగ్

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీపై మాజీ ప్ర‌ధాని, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత మ‌న్మోహ‌న్ సింగ్ మండిపడ్డారు. ప్ర‌తి స‌మ‌స్య‌కు జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూనే ఎందుకు కార‌ణంగా చూపుతున్నార‌ని ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. ప్రధాని పదవికి ఓ గౌరవం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని మోడీకి ప్రజలను విడగొడుతున్నారని మండిపడ్డారు. ఓ వైపు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా.. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రతి సమస్యకూ నెహ్రూనే కారణమంటూ మాట్లాడడం ఎంత వరకు సమంజసమన్నారు. తప్పులను కప్పిపుచ్చి ప్రధాని పదవికి మచ్చ తేవొద్దని హితవు చెప్పారు. తాను ప్రధానిగా ఉన్న పదేళ్లు.. తన పనులపైనే మాట్లాడానని గుర్తు చేశారు. ప్రపంచం ముందు దేశ పరువు ఎన్నడూ తీయలేదన్నారు. ‘‘నేను నోరు లేనివాడినని, అవినీతి పరుడినని, బలహీనుడినని బీజేపీ, ఆ పార్టీ బీ, సీ టీమ్ లు ఆరోపించినా.. ఆ పార్టీల తీరేంటో ప్రజలకు తెలిసొస్తుండడం పట్ల నేనిప్పుడు సంతోషంగా ఉన్నాన‌న్నారు.

బీజేపీ ప్రభుత్వానికి ఆర్థిక విధానాలపై అసలు అవగాహనే లేదని, ఇది కేవలం దేశానికి సంబంధించిన విషయమే కాదన్నారు. విదేశాంగ విధానాలపైనా ప్రభుత్వం విఫలమైందన్నారు. నేతలను కౌగిలించుకోవడం, చేతులు కలపడమే విదేశాంగ విధానం కాదని ప్రధాని తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వ జాతీయవాదం అత్యంత ప్రమాదకరమని వ్యాఖ్యానించారు. విభజించు పాలించు అన్న బ్రిటీష్ నియమాలనే బీజేపీ పాటిస్తోందన్నారు. రాజ్యాంగసంస్థలను బలహీనం చేశారని ఆరోపించారు. ప్రస్తుత ఆర్థిక విధానాల్లో స్వార్థం, దు:ఖం తప్ప ఏమీ లేదన్నారు. పంజాబ్ లో ప్రధాని భద్రతా లోపాలపై స్పందించిన ఆయన.. భద్రత పేరిట పంజాబ్ సీఎం చరణ్ జిత్ సింగ్ చన్నీ, ఆ రాష్ట్ర ప్రజలను అవమానించే కుట్ర చేశారని మండిపడ్డారు. రైతు ఉద్యమ సమయంలోనూ పంజాబీలను దోషులుగా చూపించే కుట్ర చేశారన్నారు. పంజాబ్ నుంచి వచ్చిన నిజమైన భారతీయుడిగా ఆ విషయాలు తనను తీవ్రంగా బాధించాయన్నారు. చాలా రోజుల త‌ర్వాత మ‌న్మోహ‌న్ బ‌య‌టికి వ‌చ్చి ఇలా బిజెపిపై మండిప‌డ్డ‌టం విశేష‌మే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement