లండన్ : బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ ను హత్య చేసేందుకు యత్నించిన 19సంవత్సరాల యువకుడిని స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అరెస్ట్ చేశారు. తాను ఇండియన్ సిక్కు అని తెలిపాడు. తన పేరు జశ్వంత్ సింగ్ ఛాయిల్ అని యువకుడు వెల్లడించారు. కాగా ఎలిజిబెత్ ను చంపడానికి గల కారణాన్ని వివరించాడు. 1919లో జరిగిన జలియన్ వాల్ బాగ్ మారణకాండకు ప్రతీకారంగా చంపాలనుకున్నట్లు చెప్పాడు. ఈ మేరకు స్నాప్ చాట్ లో వీడియో పెట్టాడు. ఈ వీడియో తీసే సమయంలో పూర్తిగా ముసుగు ధరించి ఉన్నాడు. కాగా అతని మానసిక స్థితి పై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేశారు. అతడిని ప్రస్తుతం మానసిక వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి విండ్సర్ క్యాజిల్ రాజ ప్రసాదానికి క్వీన్ ఎలిజబెత్ వెళ్లారు. ఆ యువకుడు అక్కడికి వెళ్లాడు.
చేతిలో విల్లు లాంటి క్రాస్ బౌ ఆయుధం కూడా ఉంది. రాణి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు 24 నిమిషాల ముందు తీసుకున్న వీడియోను ఆ యువకుడు స్నాప్ చాట్ లో పెట్టాడు. ‘ నన్ను క్షమించండి. నేను చేసిన దానికి, చేయబోయే దానికి క్షమించండి. రాజ కుటుంబానికి చెందిన క్వీన్ ఎలిజబెత్ ను హత్య చేస్తాను. 1919 లో జరిగిన జలియన్వాలా బాగ్ మారణకాండకు ఇది ప్రతీకారం. జాతి పేరుతో వివక్షకు గురై ప్రాణాలు కోల్పోయిన వారి తరఫున పగ సాధిస్తాను. నేను భారతీయ సిక్కును. నా పేరు జస్వంత్ సింగ్ ఛాయిల్- డార్త్ జోన్స్’ అని అందులో పేర్కొన్నాడు. స్టార్ వార్ సినిమా లో ఓ ముసుగు మనిషి నల్లని ఆయుధాన్ని పట్టుకొని భయానక గొంతుతో మాట్లాడినట్టుగా ఈ వీడియో అనిపించింది. దీన్ని తన ఫాలోవర్స్ కు పంపించాడు.దాంతో పాటుగా ఓ సందేశం పెట్టాడు. ‘తప్పు చేసినందుకు, అబద్ధాలు ఆడినందుకు క్షమించండి. ఈ వీడియో మీరు అందుకున్నారంటే నా చావు దగ్గర పడినట్టే లెక్క. అవకాశం ఉంటే దీనిని షేర్ చేయండి. ఆసక్తి ఉంటే దీన్ని వార్త ప్రసారం చేయండి. అంటూ అందులో పేర్కొన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి సౌతాంప్టన్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. పోలీసులు అక్కడికి వెళ్లి సోదాలు జరిపి ఒక క్రాస్ బౌ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..