Saturday, November 23, 2024

కాంగ్రెస్ లో ‘పెద్దాయన’ మంత్రం!

తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం నాగార్జునసాగర్ ఉపఎన్నిక చూట్టునే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంపై దృష్టి పెట్టాయి. అయితే, నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల వేళ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో కొత్త చర్చ మొదలయ్యింది. ఈ ఉప ఎన్నికల్లో పార్టీ ఆశించిన ఫలితంవస్తే ఎన్నికల అనంతరం పార్టీలో భారీ మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. గత రెండేళ్లుగా టీపీసీసీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం అదుగో, ఇదుగో అంటూ నానుతూ వస్తోంది. ఈ ఉపఎన్నిక తర్వాతే కొత్త అధ్యక్షుడు రానున్నాడు. అయితే, ఇప్పుడు చీఫ్ ఎవరు ? అన్నదానిపై చర్చ సాగుతోంది. ఇందులో అనూహ్యం సాగర్ అభ్యర్థి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

ఈ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి జానారెడ్డి గెలిస్తే.. ఆయన్నే టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించాలనే ఆలోచనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. 2023 ఎన్నికలను ఎదుర్కొనే బాధ్యతలను కూడా జానారెడ్డికి అప్పగించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడగా.. ఆ వెంటనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. పీసీసీ అధ్యక్ష పదవి ఆశించిన కోమటిరెడ్డి, రేవంత్, జీవన్‌రెడ్డి, శ్రీధర్‌బాబు తదితరులు పోటీలో ఉన్నారు. పీసీసీ పదవి కోసం పోటీ పడే నేతల జాబితా చాంతాడంత ఉండడం, షార్ట్‌లిస్ట్‌ చేసిన తర్వాత కూడా ఏకాభిప్రాయం రాకపోవడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. టీపీసీసీ అధ్యక్ష వ్యవహారాన్ని సాగర్‌ ఉప ఎన్నికల వరకు వాయిదా వేస్తున్నట్టు కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించినా.. ఇటీవల ఢిల్లీలో ఈ అంశంపై కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగానే జానా రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. పార్టీలోని సీనియర్ ముఖ్య నాయకుడు జానా పేరు ప్రతిపాదించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. సాగర్‌లో గెలిస్తే రాష్ట్ర పార్టీని హస్తగతం చేసుకోవాలనే వ్యూహంతోనే జానారెడ్డి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ‘పెద్దాయన’అనే మంత్రంతో జానాను తెరపైకి తెచ్చి ఎలాంటి విభేదాలు, గొడవలు లేకుండా పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement