పాకిస్థాన్ పై మండిపడింది భారత్..ఉగ్రవాదులకు అండగా ఉంటూ వారికి శిక్షణ ఇస్తోందన్న సంగతి అందరికీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సహా అన్ని పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలనే కోరుకుంటుందని స్పష్టం చేశారు. అయితే, సీమాంతర ఉగ్రవాదంపై అంతే కటువుగా ఉంటామని తేల్చి చెప్పారు. పాక్ లో ఉగ్రవాదులు స్వేచ్ఛగా తిరుగుతారని, దాని నుంచి దృష్టి మరల్చేందుకే భారత్ పై ఆ దేశం విషం కక్కుతోందన్నారు.ఈ మేరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ కు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది.
ఐరాస వేదికలను పాకిస్థాన్ దుర్వినియోగపరుస్తోందని, తమ దేశంపై అబద్ధపు తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడింది. ‘దౌత్య విధానాల ద్వారా అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణ’ అనే అంశంపై చర్చ సందర్భంగా భారత్ తరఫున ఐరాసలో భారత శాశ్వత కౌన్సిలర్, న్యాయ సలహాదారు డాక్టర్ కాజల్ భట్ చర్చలో పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్ పై పాక్ ప్రతినిధి చేసిన వ్యాఖ్యలకూ కౌంటర్ ఇచ్చారు. అది ఇప్పటికీ ఎప్పటికీ భారత్ లోని భూభాగమేనని కాజల్ భట్ తేల్చి చెప్పారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను ముందు ఖాళీ చేయాలని, ఆ దేశం ఆక్రమించిన కశ్మీర్ లోని అన్ని ప్రాంతాలనూ వదిలి వెళ్లాలని హెచ్చరించారు. పాకిస్థాన్ తో చర్చలంటూ జరిగితే అది ఉగ్రవాదం, హింసలేని వాతావరణంలోనే జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily