నిషేదిత లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రాణాలతో అరెస్టు చేశారు. ఉత్తర కశ్మీర్ లోని సోపోర్ ప్రాంతంలో నిన్న వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి మూడు చైనీస్ తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల నాన్ లోకల్ కార్మికులను చంపడం, వివిధ ప్రాంతాల్లో గ్రెనేడ్లు విసిరి అలజడి సృష్టించడం వెనుక లష్కరే తాయిబా హస్తం ఉందనే విషయం విచారణలో తేలింది. వీటికి సంబంధించి ముగ్గురుని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. మారణహోమం సృష్టించేందుకు, గ్రనేడ్ల దాడులకు ఉగ్రవాదులు ప్రణాళికలు రూపొందించినట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు బారాముల్లా జిల్లాలో ఇంటర్ డిస్ట్రిక్ట్ నార్కో టెర్రర్ మాడ్యూల్‌ను జమ్మూకశ్మీర్ పోలీసులు ఛేదించారు. ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేశారు. ఆ ఇద్దరి నుంచి రూ. 1.5 కోట్ల విలువ చేసే హెరాయిన్‌తో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వీరిపై యూఏపీ యాక్ట్, ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.