– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ
గణపతిని పూజించడానికి అనుకూలమైన సమయం ఏంటంటే:
పండితులు తెలిపిన ప్రకారం.. ఆగస్టు 31వ తేదీన వచ్చే గణేష్ చతుర్థి రోజు అంటే రేపు (బుధవారం) గజాననుని పూజించడానికి ఉత్తమ సమయం ఉదయం 11:07నుండి మధ్యాహ్నం 01:39. ఈ రోజు గణపతి ఆరాధన ఉత్సవాలు ప్రారంభమై.. 10 రోజుల పాటు జరగనున్నాయి. అనంత చతుర్దశి రోజున ఉత్సవాలు ముగియనున్నాయి.
పూజలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
సనాతన సంప్రదాయంలో గణపతి పూజా సమయంలో కొన్ని నియమాలు, ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. లేదంటే వ్యక్తి శుభ ఫలితాలకు బదులుగా అశుభ ఫలితాలను పొందుతారని పెద్దలు చెబుతున్నారు. గణపతి పూజలో మరిచిపోయి కూడా తులసి ఆకులను ఉపయోగించరాదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా గణపతి పూజలో ఎండిపోయిన లేదా వాడిపోయిన పువ్వులను అస్పలు సమర్పించవద్దు.
వినాయకుడిని ఎలా పూజించాలంటే:
గణేష్ చతుర్థి రోజు వినాయకుడిని పూజించడానికి ముందుగా గజాననుడి విగ్రహాన్ని ఎర్రటి వస్త్రంతో ఒక ఆసనంపై ఏర్పాటు చేసుకోవాలి. దీని తర్వాత గణపతిని ఆవాహన చేయాలి. విగ్రహానికి పాలు , పెరుగు , తేనె , స్వచ్ఛమైన నెయ్యి , గంగాజలం మొదలైన వాటితో శుద్ధి చేయాలి.. అనంతరం గణపతి విగ్రహానికి పుసుపు పూసి.. కుంకుమతో అలంకరించాలి. తర్వాత బట్టలు, వస్తువులతో సముచితంగా అలంకరించాలి. ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. పండ్లు , చెరకు , అరటి , తమలపాకులు సమర్పించాలి. ధూప దీప నైవేద్యంతో గణపతిని పూజించి.. గణపతి వ్రత విధాన కథను పటించాల్సి ఉంటుంది.
గణపతిని పూజించడానికి గొప్ప మార్గం:
ఒక పిల్లవాడు చదవు సంధ్యల విషయంలో బలహీనంగా ఉంటే.. వినాయక చవితి రోజున గణపతిని పూజించడం శుభఫలితాలను ఇస్తుందని పూజారులు, పండితులు, పెద్దలు చెబుతున్నారు. గణేష్ ఉత్సవంలో వరుసగా 10 రోజులు గణపతి ఆరాధనలో స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగించడం వల్ల శరీర బాధలు తొలగిపోయి శక్తి , తెలివి, జ్ఞానం లభిస్తాయని అనాదిగా వస్తున్న నమ్మకం.