Tuesday, November 26, 2024

Political Game – ఎమ్మెల్యేల‌కు ఎంపిలుగా ఛాన్స్…జ‌గ‌న్ స‌రికొత్త వ్యూహం..

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: మార్పుల్లో భాగంగా కొందరు ఎంపీలను అసెంబ్లి బరిలోకి దింపాలని, మరికొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలను పార్లమెంట్‌ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అలా చేయడంవల్ల జిల్లాల పరిధిలో చాలా వరకూ అభ్యర్థులపై అసంతృప్తి తగ్గే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఆ దిశగానే అభ్యర్థుల ఎంపికను చేపడుతున్నట్లు చెబుతున్నారు. వారం రోజులుగా అవకాశం దొరికినప్పుడల్లా ఇదే అంశంపై ముఖ్య నేతలతో సీఎం జగన్‌ సమాలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. కష్ట కాలంలో తన వెనుక నడిచిన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడంతోపాటు వివిధ కారణాలతో ప్రజలకు దూరంగా ఉంటున్న వారికి కూడా తిరిగి అవకాశం కల్పించే దిశగానే ఆయన ఆలోచన చేస్తున్నారు. అందుకోసం కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలను ఎంపీలుగా బరిలోకి దించాలని చూస్తున్నారు. తద్వారా పార్లమెంటు పరిధిలో సమీకరణలు మారి వెనుకబడిన ఎమ్మెల్యేను కూడా గెలిచే అవకాశాలు ఉంటాయని ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. మరికొన్ని జిల్లాల్లో అయితే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి వారసులను రంగంలోకి దించాలని ఆదిశగా కూడా సిట్టింగులకు పరోక్షంగా సహకారాన్ని అందించాలని ఆయన చూస్తున్నట్లు చెబుతున్నారు.

పలువురికి ఎంపీలుగా అవకాశం
2019 ఎన్నికల్లో పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. వారంతా 2014 ఎన్నికల్లో వైసీపీ నుండి గెలుపొందిన వారే. అయితే వివిధ కారణాలతో వారిపై కొంత వ్యతిరేకత రావడంతో సీఎం జగన్‌ వారిని వదులకోవడం ఇష్టం లేక ప్రత్యామ్నాయంగా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లిd నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం కల్పించారు. ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చింది. దీంతో 2024 ఎన్నికల్లో కూడా అదే తరహాలో ఎమ్మెల్యేలకు ఎంపీలుగా, ఎంపీలకు ఎమ్మెల్యేలుగా సర్దుబాటు చేస్తే అనుకూల వాతావరణం ఉంటుందని యోచిస్తున్నారు. అందులో భాగంగానే శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పార్టీ సీనియర్‌ నేత రాజ్యసభ సభ్యుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర రెడ్డిని వచ్చే ఎన్నికల్లో నెల్లూరు పార్లమెంటు నుండి బరిలోకి దించే యోచనలో సీఎం జగన్‌ ఉన్నారు. ఇప్పటికే ఆదిశగా వీపీఆర్‌కు ఇదే విషయాన్ని చెప్పారు. దీంతో ఆయన పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తూ బలమైన అభ్యర్ధులను బరిలోకి దించే యోచన చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం నెల్లూరు సిట్టింగ్‌ ఎంపీ ఆదాల ప్రభాకర రెడ్డికి వచ్చే ఎన్నికల్లో నెల్లూరు రూరల్‌ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్ధిగా సీఎం జగన్‌ రంగంలోకి దించబోతున్నారు. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఇదే తరహా మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో చర్చించి సర్దుబాటు దిశగా నిర్ణయాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది.

త్వరలో కొలిక్కి
వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడనుంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే తెలంగాణతోపాటు నవంబరు, డిసెంబరులోనే ఏపీలో కూడా ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు ప్రధాన పార్టీల నేతల్లోనూ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇప్పటికే జిల్లాల వారీగా అభ్యర్ధుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం జగన్‌ ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక సంబంధించిన ప్రక్రియను ప్రారంభించినట్లు చెబుతున్నారు. జూన్‌ నెలాఖరులోపు దాదాపు ఆ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకొచ్చి జిల్లాల పర్యటనకు వెళ్లాలని సీఎం జగన్‌ యోచిస్తున్నారు. అందులో భాగంగానే ఆయా జిల్లాల్లో నిత్యం ప్రజల్లో ఉండే నేతలకు ఎంపీలుగానూ అవకాశం కల్పించబోతున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో కొంతమందిపై వ్యతిరేకత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వారి కుమారులకు అవకాశం కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు జిల్లాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల స్థానంలో వారి వారసులకు టిక్కెట్లు ఇచ్చేలా కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement