అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టైల్ మార్చారు. గతంలో జిల్లా పర్యటనలకు వెళ్లిన సందర్భంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకు లకే ఎక్కువ సమయం కేటాయించే సీఎం జగన్ తాజాగా నెల్లూరు జిల్లా పర్యటనలో ద్వితీయ స్థాయి నేతలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. గతంలో ఆ స్థాయి నాయకులను పలకరించడంతోనే సరిపెట్టుకునే జగన్ శుక్రవారం నాటి పర్యటనలో మాత్రం ముఖ్య నాయకుల కంటే ఎక్కువ సమయం స్థానిక నేతలకు కల్పించారు. ప్రతిఒక్కరినీ పేరుపేరున పలకరిస్తూ వారితో మూడునాలుగు నిమిషాలు మాట్లాడారు. అదేవిధంగా స్థానికంగా నేతల మధ్య ఉన్న దూరాన్ని కూడా తగ్గించేలా ఒకరిద్దరు నేతలను ఆయనే స్వయంగా పిలిచి చేతులు కలిపి ఐక్యంగా కలిసి పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నా కూడా సీఎం జగన్ స్థానిక నేతల మధ్య ఉన్న సమస్యలను స్వయంగా పరిష్కరించేలా రంగంలోకి దిగడం పార్టీ వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు తెరలేపింది. ముఖ్యంగా అధికార వైసీపీ నేతల్లో అయితే ఆనందానికి అవధుల్లేవు. నిత్యం బిజీ షెడ్యూల్లో ఉండే సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జిల్లాకు రావడంతో పాటు స్థానికంగా ఉన్న నేతలకు ఎక్కువ సమయం కేటాయించారు. గతంలో బొకే తీసుకుని పలకరించి చిరునవ్వుతో వెళ్లిపోయేవారు. ప్రస్తుతం మాత్రం అందుకు పూర్తి భిన్నంగా స్థానిక నేత దగ్గర మూడు నుంచి నాలుగు నిమిషాలు ఆగి వారితో వివిధ అంశాలు మాట్లాడారు. ఆ మాట్లాడే సందర్భంలో కూడా ఆ చేయి భుజాన వేసి మరో చేతితో నాయకుని చేతిని పట్టుకుని యోగక్షేమాలు అడగడంతో పాటు పార్టీపరంగా కూడా వివిధ అంశాలు మాట్లాడారు. ప్రత్యేకించి కావలి, ఉదయగిరి, నెల్లూరు నాయకులతో ఎక్కువసేపు మాట్లాడడంతో ఆయా ప్రాంతాలకు చెందిన ద్వితీయ స్థాయి నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరు పర్యటనలో..కొత్త అడుగులు
ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీల ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. తెలుగుదేశం, జనసేన పార్టీలు అధికార వైసీపీపై తిరుగుబాటు చేస్తున్నాయి. మరోవైపు వైసీపీ తమ హవాను కొనసాగించేలా వ్యూహాత్మకంగా పావులు కదుపుతుంది. అందులో భాగంగానే ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లా పర్యటనలో చుక్కల భూముల సమస్యకు పరిష్కారాన్ని చూపుతూ శాశ్వత పత్రాలను రైతులకు అందించి సరికొత్త చరిత్ర సృష్టిస్తూనే మరోవైపు జిల్లాలో రాజకీయంగా కొత్త అడుగులు వేశారు. మండల స్థాయి నాయకులకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ వారిని పేరుపేరునా పలకరిస్తూ జిల్లా పర్యటనను ప్రారంభించారు. పర్యటన ముగించుకుని వెళ్లే సమయంలోనూ అదే చిరునవ్వుతో పలకరిస్తూ వెళ్లారు. ముఖ్యంగా నెల్లూరు జిల్లా పార్టీలో ఇటీవల కాలంలో చోటుచేసుకుంటున్న సంఘటనలను దృష్టిలో ఉంచుకుని సీఎం జగన్ వ్యూహాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే మాజీ మంత్రి, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పోలుబోయిన అనీల్‌కుమార్ యాదవ్, నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్‌ల మధ్య గత కొంతకాలంగా విభేదాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. స్వయాన బంధువులు అయిన వారిద్దరు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నేతలు. ఈ నేపధ్యంలోనే వారిద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించేలా సీఎం జగన్ కావలిలో వారిరువురిని పిలిచి చేతులు కలిపారు. కలిసి పనిచేయాలని రూప్‌కు సీఎం జగన్ సూచించారు. అలాగే ఉదయగిరి నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం పరిశీలకులుగా ఉన్న మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ వైసీపీ విజయం సాధించేలా అందరూ కలిసి ముందుకు సాగాలని చెప్పారు. అలాగే మాజీ ఎమ్మెల్యే వంటేరు వేణుగోపాల్‌రెడ్డి, రాష్ట్ర పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుకూరు చిరంజీవిరెడ్డి, ఉదయగిరి నేత చేజర్ల సుబ్బారెడ్డి తదితర నాయకులతోనూ సీఎం జగన్ కొంత సమయం కేటాయించి మాట్లాడారు. అలాగే నెల్లూరు నగరానికి సంబంధించిన సీనియర్ నేత, రాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సన్నపురెడ్డి పెంచలరెడ్డి ని సీఎం జగన్ నవ్వుతూ పలకరించారు. వారితో పాటు జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన మరి కొంతమంది ద్వితీయ స్థాయి నేతలతోనూ సీఎం జగన్ చిరునవ్వులతో పలకరిస్తూ ముందుకు సాగారు.