హైదరాబాద్, ఆంధ్రప్రభ : నీ ఆస్తులు ఎంత? నా ఆస్తులు ఎంతో బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగదీష్ రెడ్డికి కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సవాల్ విసిరారు. 2014 సంవత్సరానికి ముందు మంత్రి జగదీష్ రెడ్డికి ఎంత ఆస్తులు ఉన్నాయో ప్రజలకు తెలుసన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో మంత్రి చెక్కుచేతల్లో ఇసుక, రియల్ ఎస్టేట్ దందా నడుస్తోందని ఆయన ఆరోపించారు. అవినీతిపరులని కాంగ్రెస్, బీజేపీ నేతలను తిడుతున్న టిఆర్ఎస్ నాయకులే తెలంగాణను దోచుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. శుక్రవారం మీడియా పాయింట్లో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు.. సింగరేణికి చెందిన ఒడిషా రాష్ట్రంలోని నైనీ బొగ్గుగని టెండర్లు పారదర్శకంగా జరగలేదని ఆయన ఆరోపించారు.
దీని వలన సింగరేణి సంస్థ కనీసం 20 వేల కోట్ల రూపాయలను నష్టపోతుందన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కాకుండా అడ్డుకుంటామని చెబుతూనే ఆ సంస్థకు నష్టం వచ్చేలా టెండర్లు ఇస్తున్నారని ఆయన అన్నారు. సభలో సింగరేణి సంస్థపై తాను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సిఎం కేసీఆర్నే పొగుడుతూ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడారని ఆయన ఆక్షేపించారు. పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా కాంట్రాక్టర్ అని పిలవడం తనను ఎంతో బాధించిందన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక సీమాంధ్ర కాంట్రాక్టర్లకే కాళేశ్వరం పనులు అప్పగించిన విషయం వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. తాము డబ్బు మనుషులం కాదని, కేవలం ప్రజా సేవ కోసమే వ్యాపారాలను సైతం త్యాగం చేశామన్నారు. డబ్బు సంపాందించాలనే ఆశ ఉంటే ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీలోనే చేరేవాళ్ళమన్నారు. టిఆర్ఎస్ పార్టీ నేతల అబద్ధాలను ప్రజలు నమ్మరని, నియంత పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామన్నారు.