Tuesday, November 26, 2024

జగదభిరాముని మహాపట్టాభిషేకం.. హాజరుకానున్న గవర్నర్‌ తమిళిసై దంపతులు

భద్రాచలం, ప్రభన్యూస్‌: ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మహా పట్టాభిషేకంలో పాల్గొనేందుకు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దంపతులు హాజరుకానున్నారు. మహాపట్టాభిషేకానికి దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాట్లు ఘనంగా చేశారు. భద్రాచలం శ్రీ రామ దివ్యక్షేత్రంలో జరిగే అనేక ఉత్సవాల్లో విశిష్టమైన, విలక్షణమైన రెండు ఉత్సవాలు జరుగుతాయి. వాటిలో సీతారామ కళ్యాణం ఒకటి కాగా, రెండవది శ్రీరామ మహా పట్టాభిషేకం ప్ర పంచంలో ఏ స్వామికి జరగని రీతిలో భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో కళ్యాణం అనంతరం వైకుంఠ రామునికి పట్టాభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీరామ నవమినాడు అంగరంగ వైభవంగా శ్రీరాముని కళ్యాణం జరుగుతున్న విషయం విధితమే. కానీ పట్టాభిషేకం అనేది ప్రపంచవ్యాప్తంగా శ్రీరాముడికి తప్ప మరే ఇతర దేవతలకు జరపజాలని విలక్షణమైన ఉత్సవం. ఈ క్షేత్రంలో ఈ పట్టాభిషేకం నాలుగు విధాలుగా జరుగుతుంటుంది.

నిత్యం జరిగే శ్రీరామ రామాయణ పారయణమునకు అనుగుణంగా ప్రతి నెల పుష్యమినాడు జరిగే దానిని శ్రీరామ పట్టాభిషేకం అని, ప్రతి ఏటా శ్రీరామనవమికి మరునాడు జరిగే దానిని శ్రీరామ మహాపట్టాభిషేకం అని, ప్రతి పుష్కరానికి (12 సంవత్సరాలు) జరిగే ఈ ఉత్సవాన్ని పుష్కర సామ్రాజ్య పట్టాభిషకం గాను, 60 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఉత్సవాన్ని శ్రీరామ మహా సామ్రాజ్య ప్టటాభిషేకంగా నిర్వహించడం భద్రాచలంలో ఆనవాయితీగా వస్తుంది. 1987లో మహా సామ్రాజ్య పట్టాభిషేకం జరగగా, 1999లో ప్రధాన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగింది. నేడు జరిగే మహా పట్టాభిషేకాన్ని భద్రాచలంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. పట్టాభిషేకంలో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై దంపతులు పాల్గొననున్నందున భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో భక్తులు ఎటువంటి ఇబ్బందులకు గురికాకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement