సంచలనం సృష్టిస్తోంది అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భార్య ఇవానా ట్రంప్ వీలునామా. తన చివరి రోజుల్లో అండగా ఉన్న ఓ పెంపుడు కుక్కతో పాటు తనకు సహాయకురాలిగా ఉన్న మహిళకు తన ఆస్తిలో వాటా ఇచ్చింది. ఇవానా ట్రంప్ వీలునామా బయటకు రావడంతో.. పెంపుడు జంతువుల పట్ల ఆమెకున్న అనుబంధాన్ని ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. 73 ఏండ్ల ఇవానా ట్రంప్ గత ఏడాది జూలై నెలలో ఇంటి మెట్లపై నుంచి జారిపడి మరణించింది. ట్రంప్‌తో విడాకులు తీసుకున్న అనంతరం ఇవానాకు మాన్‌హట్టన్‌లోని విలాసవంతమైన బంగ్లా వచ్చింది. ఈ బంగ్లాను విక్రయించగా దాదాపు రూ.215 కోట్లు వచ్చినట్లు సమాచారం. డొనాల్డ్ ట్రంప్ దివంగత భార్య తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆమె చనిపోవడానికి ముందు రాసిపెట్టిన వీలునామా ఇప్పుడు బయటకు వచ్చింది. తన జీవిత చరమాంకంలో ఆహ్లాదం పరిచిన తన పెంపుడు కుక్క టైగర్ ట్రంప్‌కు తన ఆస్తిలో వాటా ఇచ్చారు.
ఈ భూమిని వదిలిపెట్టిపోయే సమయంలో తన ఇంట్లో ఉండే అన్ని రకాల జంతువులకు ఆస్తిలో వాటా అందాలని పేర్కొన్నారు. అలాగే, ట్రంప్ నుంచి దూరమైన తర్వాత తన బాగోగులను చూసిన సేవకురాలు సుజానా డోర్తీ కర్రీకి మియామీ బీచ్ సమీపంలోని విలువైన అపార్ట్‌మెంట్‌ను ఇస్తున్నట్లు వీలునామా రాశారు. ఇవానా ట్రంప్ ఆస్తి విలువ మొత్తం 34 మిలియన్ డాలర్లు (మన కరెన్సీలో దాదాపు రూ.280 కోట్లు). ఈ ఆస్తిని ముగ్గురు కుమారులకు సమానంగా పంచారు. సుజానాకు ఇచ్చిన మియామీ బీచ్‌లోని అపార్ట్‌మెంట్ (1000 చదరపు అడుగులు) ఖరీదు దాదాపు రూ.9 కోట్లుగా ఉండనున్నది. ఈ అపార్ట్‌మెంట్‌ను ఇవానా 2009 లో రూ.5.25 కోట్లకు కొనుగోలు చేశారు. 2017 లో వెలువడిన ఇవానా పుస్తకం రైజింగ్ ట్రంప్‌లో కూడా సుజానా గురించిన ప్రస్తావన కూడా ఉన్నది. తన ముగ్గురు పిల్లలు పెద్దయ్యే వరకు వారి బాగోగులు చూసిన సుజానా.. అనంతర కాలంలో ఇవానాకు సహాయకురాలుగా ఉన్నారు. తన వీలునామాలో వార్డ్ రోబ్ వస్తువులను కూడా ఇవానా పంపిణీ చేసింది. తన వార్డ్‌రోబ్‌లో ఎక్కువ భాగం రెడ్‌క్రాస్, సాల్వేషన్ ఆర్మీకి విరాళంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఫర్ కలెక్షన్, నగలు అమ్మగా వచ్చిన డబ్బును కూడా తన పిల్లలకు ఇవ్వాలని వీలునామాలో రాశారు.ఇప్పుడీ వీలునామా చర్చనీయాంశంగా మారింది.