రాజకీయంగా వారితో విభేదిస్తున్నామన్న ఒకే ఒక్క కారణంతో హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసి.. మోదీ ప్రభుత్వం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆరోపించారు. కుంచిత రాజకీయాల కోసమే కేంద్రం ఐటీఐఆర్ రద్దు చేసిందని మంత్రి విమర్శించారు. ఐటీఐఆర్ స్థాయిలో రాష్ట్రానికి పలు ప్రాజెక్టులను మంజూరు చేశామని పార్లమెంట్‌లో నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి దేశ ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేశామని తాజాగా పార్లమెంట్‌లో కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన ప్రకటనను కేటీఆర్ తీవ్రంగా తప్పుపట్టారు. బీజేపీ డీఎన్ఏలో నిండి ఉన్న అసత్యాలు, అవాస్తవాలు, పచ్చి అబద్ధాలను ఎప్పటిలాగే అలవోకగా కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వల్లె వేశారని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణకు శనిలా దాపురించిన మోదీ ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు, విభజన హమీల మాదిరిగానే హైదరాబాద్ ఐటీఐఆర్‌ను కూడా మూలకుపెట్టిందని మంత్రి కేటీఆర్ విమర్శించారు.