అకాడమిక్ ఇయర్ పూర్తి అయినా.. తమకు ఐటీఐ రెండో సంవత్సర వార్షిక పరీక్షలు ఎందుకు నిర్వహించటంలేదని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వెంటనే పరీక్షలు పెట్టాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని సిద్ధార్థా ప్రయివేటు ఐటీఐ కళాశాల ఎదుట సదరు కళాశాలకు చెందిన విద్యార్థులు శనివారం నిరసన తెలిపారు. ఎన్ని మార్లు సంప్రదించినా పట్టించుకోవటంలేదని సంబంధిత శాఖా అధికారులు స్పందించి వెంటనే తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యర్థులు మాట్లాడుతూ 2019లో 160 మంది విద్యార్థలు సిద్ధార్థా కళాశాలలో ఎక్ట్రికల్ విభాగంలో అడ్మిషన్ కాగా, అందులో 130 మంది ఫీజులు 80శాతం పైగా చెల్లించామన్నారు. కరోనా కారణంతో జనవరిలో జరగాల్సిన వార్షిక పరీక్షలు మార్చి 14వ తేదీకి వాయిదా వేశారని, చెప్పిన సమయం దాటి పోయినా పరీక్షల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయమై కళాశాలో సంప్రదించగా పొంతన లేని సమాధానాలు చెబుతూ.. అందరు ఫీజులు చెల్లిస్తేనే పరీక్షలు ఉంటాయని, ఫీజులు చెల్లించిన వారికి సైతం వారితో పాటే నిర్వహిస్తామని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాల నిర్ణయంతో తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని, మరో ఏడాది సమయం వృథా అవుతోందని వాపోయారు. కళాశాలలో సైతం సరైన ఫ్యాకల్టీ లేదని కరోనా సాకుతో నెలల తరబడి కళాశాల సక్రమంగా నడపలేదని తెలిపారు. వచ్చే 6నెలల్లో ఉద్యోగా నోటిఫికేషన్లకు తమ సర్టిఫికేట్స్ అత్యవసరమని తమకు వెంటనే పరీక్షలు నిర్వహించాలని కోరారు.
మరోవైపు ఈ విషయంపై కళాశాల ఫ్యాకల్టీ వివరణ ఇచ్చారు. విద్యార్థులకు ఇంటర్నల్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించామని, ఆ సమయంలోనే డేటాకు సంబంధించి కొన్ని ఇబ్బందులు కలగటంతో కోర్టు ద్వారా మాన్యువల్ హాల్ టికెట్లు ఇచ్చి ప్రాక్టికల్స్ నిర్వహించామన్నారు. ఇప్పుడు కూడా హాల్ టికెట్స్ వస్తే పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇదిలా ఉంటే.. పరీక్షలు నిర్వహించాలని నిరసన చేసింనందుకు కళాశాల నుంచి బెదిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. కళాశాలలో సీన్‌క్రియేట్ చేసినందుకు నిన్ను తీసేస్తున్నాను.. నీకు పరీక్షలు ఉండవు, సర్టిఫికేట్ రాదు అంటూ కళాశాల తరపునుంచి బెదిరిస్తున్నారని విద్యార్థులు వాపోయారు.