గత 30ఏళ్ల నుండి తప్పించుకుని తిరుగుతున్న ఇటలీ మాఫియా డాన్ మాటియో పోలీసులకి చిక్కాడు. మెస్సినా డినారో సిస్లీ నగరంలో పోలీసులకు చిక్కాడు. మాటియో సిస్లీ నగరంలోని ఓ ఇంట్లో తల దాచుకున్నట్లు అందిన పక్కా సమాచారంతో ఇటలీ పోలీసులు అయన్ను పట్టుకునేందుకు కాపు కాశాయి. సిస్లీ నగరంలో దాదాపు 100 మంది సైనికులను మోహరించి మాటియోను పట్టుకున్నారు. ఈయనపై 10 మందిని హతమార్చినట్లు నేరారోపణలు ఉన్నాయి. మాటియో గత కొన్ని రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతూ సిస్లీ నగరంలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇంటి నుంచి వెళ్లి చికిత్స తీసుకుని తిరిగి అదే ఇంటికి వస్తున్న విషయాన్ని ఓ వ్యక్తి పోలీసులకు ఉప్పందించాడు.
దాంతో ఈ మోస్ట్ వాంటెడ్‌ను పట్టుకునేందుకు పోలీసులు సైన్యాన్ని రంగంలోకి దించారు. పోలీసులు అతడిని పట్టుకుని తీసుకు వస్తున్న సమయంలో రోడ్డుపై ఎక్కడికక్కడ నిలబడిపోయిన ప్రజలు చప్పట్లు కొట్టి పోలీసులను అభినందించారు. ఇటలీలో అత్యంత ప్రమాదకరమైన మాఫియా అయిన కోసా నోస్ట్రా కోసం మాటియో పనిచేశాడు. ఈ మాఫియా ముఠా డ్రగ్స్, అక్రమ రవాణా, మనీలాండరింగ్ వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంది. మాటియో కూడా పోలీసు అధికారులతోపాటు ఓ 11 ఏండ్ల బాలుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 1993లో తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన వ్యక్తి కుమారుడిని కిడ్నాప్ చేసి రెండేండ్ల పాటు తన బందిఖానాలో ఉంచుకున్నాడు. చివరకు అతడిని యాసిడ్‌లోకి విసిరి దారుణంగా హతమార్చాడు.