తెలంగాణతోపాటు దేశంలోని ప్రతీ లక్ష మందిలో 198 మంది టీబీతో బాధపడుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నిన్న మొన్నటి వరకు కరోనా వైరస్ ప్రాణాంతకంగా పరిణమించింది. తాజాగా కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందనుకున్న తరుణంలో టీబీ(క్షయ వ్యాధి) కూడా దీర్ఘకాలిక రోగులపై ప్రమాదకరంగా దాడి చేస్తోంది. హెచ్‌ఐవి, డయాబెటిస్, పోషకాహార లోపంతోపాటు కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిపై టీబీ దాడిచేస్తోంది. క్యాన్సర్ కీమోథెరపీ లో ఉన్న రోగులకు కూడా టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మొండి బీమారే అయినా దీనికి మంచి మెడిసిన్స్ ఉన్నాయని, జాగ్రత్తగా మందులు వాడితే పూర్తిగా క్యూర్ అవుతుందని భరోసా ఇస్తున్నారు డాక్టర్లు.
హైదరాబాద్, ఆంధ్రప్రభ: టీబీ (క్షయ వ్యాధి) మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా కారణంగా సోకుతోంది. ప్రధానంగా ఉపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నముక, మెదడు, గర్భాశయం వంటి కీలక అవయవాల పనితీరును కూడా దెబ్బతీస్తోంది. కరోనా తర్వాత అత్యధిక మంది ప్రాణాలను బలిగొంటున్న వ్యాధుల జాబితాలో టీబీ ద్వితీయ స్థానంలో ఉంది. ప్రధానంగా టీబీ గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. క్షయ వ్యాధిగ్రస్థులు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. కుటుంబ సభ్యులతోపాటు తోటివారికి, తమ సమీపంలోని వారికి, పరిసరాల్లోని వారికీ ఈ వ్యాధి సోకుతోంది. ప్రధానంగా భారతదేశంలో టీబీ యుక్త వయసు వారికే ఎక్కువగా సోకుతోంది. ఆర్థికంగా వెనుకబడిన యువకుల్లో వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం, ఛాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండడం , రాత్రి వేళలో చెమటలు పట్టడం, ఛాతీలో నీరు చేరడం వల్ల దమ్ము కూడా రావటం టీబీ వ్యాధి లక్షణాలని వైద్యులు చెబుతున్నారు. రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో సూక్ష్మక్రిమి సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపిస్తాయంటున్నారు. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించవని, అయితే వ్యాధి సోకిన 2 నుంచి 5 సంవత్సరాలలోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయంటున్నారు.
క్రమం తప్పకుండా మందులను వాడాల్సిందే…
డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, రెనోవా ఆసుపత్రులు- సనత్‌నగర్.
టీబీ నిర్ధారణ అయిన తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కొద్ది రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గడంతో మందుల వినియోగాన్ని ఆపటం ప్రమాదకరమంటున్నారు. దాంతో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీగా వ్యాధి ముదురుతోంది. ఇలాంటి వారికి ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడితే ప్రాథమికదశలోనే టీ బీ నుంచి విముక్తి పొందొచ్చు.