మహారాష్ట్రలో అధికార కూటమి నేతల ఇండ్లపై జాతీయ దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. ఐటీ కాకపోతే ఈడీ, అదీకాకపోతే సీబీఐ అన్నట్లుగా పాలక కూటమికి చెందిన చిన్న పెద్ద అని తేడా లేకుండా నాయకుల ఇండ్లలో జాతీయ దర్యాప్తు సంస్థలు వరుసగా సోదాలు నిర్వహిస్తూ అదుపులోకి తీసుకుంటున్నాయి. బుధవారం రాత్రి ఎన్సీపీ నేత, మంత్రి నవాబ్ మాలిక్‌ను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా….
ముంబైలో శివసేన నేత, ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి సంఘం ఛైర్మన్ యశ్వంత్ జాదవ్ ఇంట్లో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో ఆయన నివాసంపై అధికారులు దాడులు జరిపారు. అయితే జాదవ్ నివాసానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బృందం కూడా చేరుకుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే యశ్వంత్‌పై భాజపా నేత కిరీట్ మనీలాండరింగ్, అవినీతి ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఈ దాడులు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా, అధికార పార్టీ నేతల ఇండ్లపై ఐటీ, ఈడీ దాడులను శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తప్పుబట్టారు. ఇవి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని విమర్శించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital