Tuesday, November 19, 2024

చ‌నువుగా ఉన్నంతమాత్రాన ఆ ప‌నికి ఒప్పుకున్న‌ట్టు కాదు.. బాంబే హైకోర్టు సంచ‌ల‌న తీర్పు!

ఒక అమ్మాయి.. అబ్బాయితో ఫ్రెండ్‌షిప్‌లో చ‌నువుగా ఉన్నంత మాత్రనా.. వారు శారీర‌క సంబంధానికి రెడీ అయిన‌ట్టు కాద‌ని, లైంగిక సంబంధానికి ఒప్పుకున్నట్టు కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ భారతీ డాంగ్రే ఆధ్వర్యంలోని సింగిల్ బెంచ్ ఈ కామెంట్స్ చేసింది. తనను వివాహం చేసుకుంటాన‌ని మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడనే కేసులో ఓ వ్యక్తి ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. ఆ బెయిల్‌ను జస్టిస్ డాంగ్రే తిరస్కరించారు. ఈ కేసులో ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని చెప్పి తన స్నేహితురాలిని మోసగించాడు. తీరా ప్రెగ్నెంట్ అయ్యాక.. వివాహం చేసుకోనన్నాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ కేసులో నిందితుడు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ వేసుకున్నాడు. బెయిల్ కావాలనే అభ్యర్థనను బాంబే హైకోర్టు కొట్టి వేసింది. అంతే కాదు ఈ కేసులో పోలీసులు మరింత లోతుగా విచారణ‌ జరపాలని, ఆ మహిళను బలవంతంగా లొంగదీసుకున్నాడో లేదో తేల్చాల్సిన అవసరం ఉందని బెంచ్‌ ఆదేశించింది. ఈ సందర్భంగా ఆడవాళ్లు, మగవాళ్లు కలసి పనిచేస్తున్న క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం, సాన్నిహత్యం ఏర్పడే చాన్స్ ఎక్కువ‌గా ఉంటుంద‌ని కోర్టు తెలిపింది.

ఇద్ద‌రి మ‌ధ్య సాన్నిహిత్యం ఏర్ప‌డితే లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి సమ్మతిగా భావించడానికి వీల్లేదని కోర్టు పేర్కొంది. స్నేహం అనేది ఆడవాళ్లను లొంగదీసుకోవడానికి దొరికే లైసెన్స్ కాదని బాంబే హైకోర్టు తెలిపింది. ప్రస్తుతం ఈ కేసులో ఆమె.. అతని పట్ల ఆకర్షితురాలైందా? లేక అత‌ను బలవంతానికి పాల్పడ్డాడా? పెళ్లి పేరుతో లొంగదీసుకున్నాడా? అనే విషయాలు తేలాలని ధర్మాసనం పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement