కాషాయ పార్టీ లక్ష్యంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా విమర్శల దాడి పెంచారు. బీజేపీ నిరక్షరాస్యలు పార్టీ అని దేశాన్ని విద్యకు దూరం చేయాలనేది వారి ఆలోచన అని మండిపడ్డారు. వారు ఇతర రాష్ట్రాల్లో చేసిన తరహాలో ఢిల్లీలోనూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే ఉద్దేశంతో వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సర్కారీ బడులు ఎందుకు మూతపడ్డాయో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.
సిసోడియా శనివారం విలేకరులతో మాట్లాడుతూ ఢిల్లీలో ఆప్ సర్కార్ను కూలదోల్చేందుకు బీజేపీ విఫలయత్నం చేసిందని, తన నివాసంలో సీబీఐ దాడుల్లో ఏమీ తేల్చలేకపోయారని అన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో లోటుపాట్లు వెదికేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మద్యం కుంభకోణంలో ఎలాంటి అక్రమాలు బయటకు రాకపోతే స్కూళ్ల నిర్మాణంలో ఉల్లంఘనలు జరిగాయని కాషాయ పార్టీ చెబుతున్నదని అన్నారు. బీజేపీ నేతలు చెప్పేవన్నీ అసత్యాలేనని సిసోడియా మండిపడ్డారు.
ఢిల్లీలో సర్కారీ బడులు మెరుగ్గా నడుస్తున్నాయని స్పష్టం చేశారు. నిరక్షరాస్యుల పార్టీ అయిన బీజేపీ దేశమంతటినీ విద్యకు దూరం చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 2015 నుంచి 700 నూతన స్కూల్ భవనాలను నిర్మించిందని చెప్పుకొచ్చారు. ఈ స్కూళ్లు ప్రైవేట్ స్కూళ్లతో పోటీ పడుతున్నాయని అన్నారు.