Monday, November 18, 2024

Big Story: పట్టింపులేవీ పట్టించుకోలే.. మంగళి పనిలో మహిళమణి..

ఆడవాళ్లంటే చాలా మందికి ఇప్పటికీ అలుసుగానే ఉంటుంది. వంటిల్లు దాటి బయటకు కాలుపెట్టకుండా ఎన్నో అడ్డంకులు సృష్టిస్తుంటారు. ఏదైనా కొత్తగా పనిచేస్తామంటే.. ఎహె.. నీ వళ్ల కాదు.. గా పని నువ్వు చేస్తవా అంటూ అడ్డుచెబుతారు. కానీ, కొంతమంది మహిళలు ఆ అడ్డంకులన్నిటినీ దాటుకుని అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కొంతమంది అయితే మగాళ్ల కంటే ఒక మెట్టు పైనే ఉంటుననారు. కాగా, బ్యూటీ, ఫ్యాషన్​ వరల్డ్​లోనూ చాలామంది ఆడాళ్లు తమ మార్క్​ కనబరుస్తున్నారు.

ఇదంతా బాగానే ఉన్నా.. కొన్ని వృత్తులను మగాళ్లే చేయాలన్న సమాజంలోని ఆలోచనలు ఇంకా మారలేదు. గౌడ, మంగళి వంటి వృత్తుల్లో ఆడాళ్ల సపోర్ట్ ఉంటుంది కానీ, నేరుగా వారు ఇన్ వాల్వ్ కారు. ఇంకా మంగలి(బార్బర్) వంటి కులవృత్తుల్లో మాత్రం ఆడాళ్లను అస్సలు దగ్గరికి కూడా రాకుండా దూరంగానే ఉంచారు. ఈ పనిని కేవలం మగవాళ్లకు మాత్రమే సొంతం అన్నట్టు భావిస్తోంది ఈ సమాజం. అట్లాంటి వారికి సరైన గుణపాఠం చెప్పాలని, ఆలోచనల్లో మార్పు తేవాలనుకుంది ఓ మహిళ. ఆ మార్పుకి తనే కారణం అవ్వాలనుకుంది. అందుకే పట్టింపులన్నింటినీ వెనక్కినెట్టి చేతిలో కత్తెర పట్టింది. ఇట్లా చేయడానికి తన పేదరికం కూడా కారణంగా చెబుతోంది.

సిద్దిపేటకు చెందిన లావణ్య లేడి బార్బర్​గా రాణిస్తోంది. పదోతరగతి వరకు చదివుకున్నా ఆ పై చదువులకు కుటుంబ స్తోమత సరిపోక మానేసింది. చిన్నప్పుడు తండ్రిని చూసి తనూ బార్బర్​ అవ్వాలనుకుంది. కానీ, ఆ వృత్తిలో ఆడవాళ్లు ఎవరూ లేకపోవడంతో ఎవరేం అనుకుంటారోనని  గమ్మున ఉండిపోయింది. ఖాళీగా ఉండలేక కుట్టు మెషిన్​ నేర్చుకుంది.. ఆ తర్వాత కొద్దిరోజులకే శ్రీనివాస్​తో పెండ్లయింది. అతను కూడా బార్బరే అవడంతో తనకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఉన్న ఆ రంగంలో డిఫరెంట్​ హెయిర్ ​ స్టయిల్స్​​ గురించి అడిగి తెలుసుకునేది.  

కరోనా కారణంగా 20 ఏండ్లుగా నడుస్తున్న తన భర్త బార్బర్​ షాప్​ మూతపడింది. ఉపాధి దెబ్బతినడంతో కూలీ పనులకు వెళ్లాల్సి వచ్చింది. ఆమె చేసే పనులతో అరకొర సంపాదన ఇంటి ఖర్చులకి కూడా సరిపోయేది కాదు. దాంతో  కుటుంబ గడవడానికి అక్కడా ఇక్కడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.  ఆ అప్పులు నుంచి బయటపడేందుకు చేయని ప్రయత్నం లేదు.. కానీ, అవేమీ వాళ్ల కష్టాలు తీర్చలేదు. దాంతో భర్తతో కలిసి తనూ కత్తెర పట్టాలనుకుంది. ఆమె ఆలోచనకి భర్త అండగా నిలిచాడు. ఐదు నెలలు ట్రైనింగ్​ ఇచ్చి డిఫరెంట్​ హెయిర్​ కట్​లు, బియర్డ్​ స్టయిల్స్​ నేర్పించాడు. ఆపద కాలంలో మిగతా కుటుంబ సభ్యులు  కూడా సపోర్ట్​ చేయడంతో భర్తతో కలిసి బార్బర్​ షాపు నడుపుతోంది లావణ్య. 

‘‘ముత్తాతల కాలం నుంచి అంతా ఈ వృత్తిలోనే ఉన్నారు. ఆడవాళ్లు ఈ వైపు రావడం మాట అటుంచితే.. కనీసం ​ షాపులో అడుగు కూడా పెట్టలేదు.   మా కుటుంబంలోనే కాదు, ఈ వృత్తిలోనే  ఆడవాళ్లు లేనే లేరు. బార్బర్​ పని అంటే మగవాళ్లకి మాత్రమే అన్నట్టు ఉంటుంది. అయినా నేను భయపడలేదు. నేనున్న పరిస్థితులు ఈ వృత్తి వైపు తీసుకొచ్చాయి.  మా ఫ్యామిలీ కూడా సపోర్టు చేసింది. ఇప్పుడు పెద్దలతో పాటు పిల్లలకి కూడా అన్ని రకాల హెయిర్​ కట్ లు ​ చేస్తున్నా’’ అంటూ చెప్పుకొచ్చింది లావణ్య.

Advertisement

తాజా వార్తలు

Advertisement