జాబిల్లి రహస్యాలను కనిపెట్టే ప్రతి ష్టాత్మకమైన చంద్రయాన్-3 ప్రయోగం నేడు మధ్యాహ్నం 2.35 గంటలకు చేపట్టనున్నారు.. చంద్రుడిపై దిగే ల్యాండర్, రోవర్లను మోసుకుంటూ ఎల్వీఎం3-ఎం4 రాకెట్ రామబాణంలా నిప్పులు చిమ్ముతూ జాబిలమ్మ వైపు దూసుకెళ్లనుంది.. ఇందుకోసం అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన శ్రీహరికోట వేదికగా మారింది.. రాకెట్ ప్రయోగానికి రిహార్సల్స్ చేసిన అనంతరం అంతా ఆల్రైట్ అని ప్రయోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.. రాకెట్ ప్రయోగాన్ని పురస్కరించుకుని షార్‌లో కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు..
సూళ్లూరుపేట(శ్రీహరికోట), ప్రభన్యూస్:
జాబిలమ్మ రహ స్యాలను చేధించే విధంగా చేపడుతున్న చంద్రయాన్ -3 ప్రయోగానికి ఇస్రో శాస్త్రవేత్తలు సర్వం సిద్దం చేశారు. నేటి మధ్యాహ్నం 2.35గంటలకు ఎల్వీఎం3-ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ -3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ ప్రక్రియను గురువారం మధ్యాహ్నం 1.05గంటలకు ప్రారంభించారు. 25.30గంటల పాటు నిర్వి రామంగా ఈ కౌంట్‌డౌన్ ప్రక్రియ కొనసాగించనున్నారు. ఈ క్రమంలో రాకెట్లో ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. మూడు దశల ఇంజన్లు కలిగిన ఎల్వీఎం3-ఎం4 రాకెట్ రెండు, మూడు దశల్లో ద్రవ ఇంధనం, మూడవ దశలోని క్రయోజనిక్ ఇంధనాన్ని నింపారు. శుక్రవారం మధ్యాహ్నం 2.35గంటలకు కౌంట్‌డౌన్ 0కు చేరుకోగానే షార్‌లోని రెండవ ప్రయోగ వేదికపై సిద్దంగా ఉన్న ఎల్వీఎం3-ఎం4 రాకెట్ తనకు నిర్ధేశించిన గమ్యాన్ని చేదించేందుకు రామబాణంలా నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లనుంది.
16 నిమిషాలలో రాకెట్ భూస్థిర కక్ష్యలోకి చంద్రయాన్ -3 పేలోడ్‌ను ప్రవేశపెట్టి తన పని ముగించనుంది. దీంతో ప్రయోగ మొదటి దశ విజయవంతం అవుతుంది. 24 రోజుల పాటు భూకక్ష్యలో తిరుగుతూ చంద్రుని దిశగా గమనం ప్రారంభించి చంద్రుని కక్ష్యలోకి చేరిన తర్వాత 19 రోజుల పాటు పరిభ్రమిస్తూ ఉంటుంది. ఆగస్టు 20 తేదీ తర్వాత చంద్రునికి 30 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకున్న ఉపగ్రహం నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయి చంద్రుని దక్షిణ ధృవంలో దిగనుంది. చంద్రునిపై ల్యాండర్ దిిగిన తర్వాత అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై 14 రోజుల పాటు సంచరిస్తూ అక్కడి వాతావరణ పరిస్థితులను, ఖనిజ నిక్షేపాలను అన్వేషించనుంది. దీంతో చంద్రుని గురించి సరికొత్త సమాచారం లభించనుంది. భారతదేశంతో పాటు యావత్ ప్రపంచం ఈ ప్రయోగం పై ఉఠ్కంత నెలకొంది.
2008లో చంద్రయాన్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆ తర్వాత చంద్రయాన్ -2 ప్రయోగంలో ల్యాండర్ చంద్రుని ఉపరితలంలో దిగే సమయంలో సాంకేతిక సమస్య తలెత్తి భూమి నుంచి ల్యాండర్‌కు సంకేతాలు తెగిపోవడంతో చంద్రుని ఉపరి తలాన్ని ఢీకొట్టడంతో ప్రయోగం విఫలమైంది. దీంతో చంద్రుని ఉపరితలంపై ఆశించిన పరిశోధనలు ఇస్రో చేయలేకపోయింది. ప్రస్తుతం చేపడుతున్న చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
అడుగడుగునా పటిష్ట బందోబస్తు చర్యలు
ఎంతో ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని శ్రీహ రికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని రెండవ ప్రయోగ వేదికపై నుంచి చేపట్టడంతో షార్‌లో అడుగడుగునా పటిష్ట బందోబస్తు చర్యలు చేపడుతున్నారు. షార్కు వెళ్లే మార్గంలోని అటకానితిప్ప వద్ద నుంచే ప్రత్యేక బలగాలు మోహరించి రాకపోకలు సాగించే వారిని క్షు ణంగా పరిశీలిస్తున్నారు. షార్ పరిసర గ్రామాల్లో అణువనుగా పరి శీలిస్తూ ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. ప్రత్యేక పోలీసు బలగాలతో సీఆర్ఎస్ఎఫ్, కేంద్ర బలగాలు షార్‌లో మోహరించి ఉన్నాయి.
వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు
ప్రయోగాన్ని వీక్షించేందుకు వచ్చే వీక్షకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లును చేపట్టారు. సుమారు 10వేల మందికి పైగా ఈ ప్రయోగాన్ని వీక్షించేందుకు విచ్చేయనున్న నేపథ్యంలో షార్‌లో అవసరమైన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. ప్రేక్షకులు ప్రయోగాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా గ్యాలరీని ఏర్పాటు చేశారు. అదేవిధంగా సూళ్లూరుపేటలో షార్ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సు లలో వీక్షకులను తరలించనున్నారు. ప్రయోగానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణంగా తనిఖీలు చేసి ప్రయోగ కేంద్రంలోకి పంపించనున్నారు. ఎక్కడా ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించి అవసరమైన చర్యలు చేపట్టారు.