తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దూకుడు మీద ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తూ పార్టీపై పట్టు సాధిస్తున్నారు. చిన్న లీడర్ల నుంచి పెద్ద స్థాయి నేతల వరకు అందరినీ కలుపుకుని వెళ్తున్నారు. తనపై అసంతృప్తి ఉన్న నాయకులను బుజ్జగించడంలో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్న రేవంత్.. అందుకు అనుగుణంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇతర పార్టీల్లో చేరిన వారిని తిరిగి సొంత గూటికి చేర్చే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరు లాంటివి ఉండేది. కానీ ఇప్పుడు వాటికి రేవంత్ చెక్ పెట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ ను రెండు వారాల క్రితం నియామకం అయిన తర్వాత కొందరు సీనియర్లు అసంతృప్తికి గురైనా.. ఇప్పుడు ఆ వాతావరణం కనిపించడం లేదు. రేవంత్ స్ట్రాటజీతో అంతా సైలెంట్ అయ్యారు. రేవంత్ కు పీసీసీ పదవి ఇస్తే కాంగ్రెస్ లో చేరుదామని చాలా మంది నేతులు ఎదురుచూశారు. దీంతో ఇప్పుడు వారు రేవంత్ వెంట నడుస్తున్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు డీఎస్ తనయుడు సంజయ్ సహా టీఆర్ఎస్, బీజేపీలో చేరిన కొందరు ఇప్పుటికే కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు కూడా హస్తం నీడలోకి వచ్చేందుకు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
అయితే, పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్ విషయంలో మాత్రం రేవంత్ ప్లాన్ బెడిసికొట్టిందని టాక్ వినిపిస్తోంది. బీజేపీ నేత వివేక్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, రేవంత్ తో రహస్యంగా చర్చలు జరిపారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. అయితే, ఆ వార్తలన్నీ అవాస్తవాలని వివేక్ అనుచరులు కొట్టిపారేశారు. వివేక్ బీజేపీని వీడే ప్రసక్తే లేదని వారు స్పష్టం చేశారు. మాజీ మంత్రి ఈటలను బీజేపీలో చేర్పించడంలో కీలక పాత్ర పోషించిన వివేక్.. కాంగ్రెస్ పార్టీ ఎలా చేరుతారా? వివేక్ అనుచరులు ఎదురు ప్రశ్నిస్తున్నారు.
అయితే, ఇదంతా పీసీసీ చీఫ్ రేవంత్ వ్యూహాంలో భాగమనే ప్రచారం జరుగుతోంది. కావాలనే ఇలా ఫేక్ న్యూస్ ప్రచారం చేశారని వివేక్ అనుచరులు ఆరోపిస్తున్నారు. వివేక్ పార్టీ మారుతున్నారనే ప్రచారం లీక్ అయితే, తన అనుచరుల నుంచి ఒత్తిడి పెరిగి బీజేపీని వీడుతారని రేవంత్ ప్లాన్ చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ విషయంలో రేవంత్ స్ట్రాటజీ బెదిసికొట్టిందనే అంటున్నారు. మరోవైపు వివేక్ పార్టీ మారుతున్నారనే ప్రచారంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇది టీఆర్ఎస్ పార్టీ పనే అని ఆరోపిస్తున్నారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా టీం కావాలనే ఇలాంటి అసత్య ప్రచారం చేసి.. కాంగ్రెస్ పై బురద జల్లె ప్రయత్నం చేస్తున్నారని విమర్శులు చేస్తున్నారు. రేవంత్ నాయకత్వం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని, చాలా మంది ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని అంటున్నారు. రాబోయే రోజుల్లో రేవంత్ స్ట్రాటజీ ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.
ఇది కూడా చదవండి: భూమి కోసం ఎమ్మార్వో కాళ్లపై పడిన మహిళ