హైదరాబాద్, ఆంధ్రప్రభ: హైదరాబాద్ నగరంలో మరోసారి ఐసిస్ కలకలం రేపింది. ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐసిస్) కార్యకలాపాలు సాగిస్తున్న పాతబస్తీ ఫలక్‌నుమాకు చెందిన యువకుడు మహమ్మద్ అబుసానిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ కేంద్రంగా కొద్ది నెలల నుంచి ఐసిస్ సానుభూతిపరులను తయారు చేసేందుకు సామాజిక మాధ్యమాలను అబుసాని విస్తృతంగా వినియోగిస్తున్నట్టు పోలీసులకు పక్కా సమాచారం అందడంతో వెంటాడి పట్టుకున్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారంతో కూపీ లాగిన సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి ఓ రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలిసింది. ఇరాక్ కేంద్రంగా ప్రపంచ వ్యాప్తంగా యువతను ఒక పథకం ప్రకారం రెచ్చగొట్టి జిహాద్ సైనికులుగా తయారు చేస్తున్న ఐసిస్ సంస్థ సభ్యులతో అబుసాని నిత్యం సామాజిక మాధ్యమాల ద్వారా సంప్రదింపులు జరుపుతున్నట్టు పోలీసుల విచారణలో బయటపడింది. ప్రత్యేకంగా యాప్‌లను సృష్టింటి వాటి ద్వారా తన స్నేహితులు, సన్నిహితులను జిహాద్ వైపు తిప్పుకునేందుకు అవసరమైన సమాచారాన్ని, వీడియోలను వారికి పంపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇందుకోసం ఐసిస్ సంస్థ నుంచి హవాలా ద్వారా నిధులు సేకరిస్తున్నట్లు పోలీసులు జరిపిన ప్రాథమిక విచారణలో బయటపడింది.
మహమ్మద్ అబుసాని ఐసిస్ సానుభూతిపరుడన్న సమాచారం అందగానే ఆయనపై నిఘా ఉంచి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. దేశంలోని మెట్రో నగరాలు, పట్టణాల్లో విధ్వంసాలు సృష్టించేందుకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు సిద్ధం చేసిందని అబుసాని లాప్‌టాప్‌న పరిశీలించిన పోలీసులు గుర్తించారు. ప్రార్థనా మందిరాలు, రద్దీగా ఉండే ప్రాంతాలు, విదేశీ రాయబార కార్యాలయాలపై బాంబులతో దాడులు జరిపి విధ్వంసం సృష్టించేందుకు అబుసాని పథక రచన చేశారు. ఇతను ఐసిస్ సానుభూతిపరుడిగా ఎప్పటి నుంచి మారాడు? ఎంత కాలంగా సామాజిక మాధ్యమాల ద్వారా యువతను ఆకర్షించేందుకు వీడియోలు, ఐసిస్ సమాచారాన్ని పంపిస్తున్నాడు? అన్న విషయాన్ని తెలుసుకునే పనిలో సైబర్ క్రైమ్ పోలీసులు నిమగ్నమయ్యారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థ తరఫున హైదరాబాద్‌లో కొందరు యువకులు గతంలోనూ పని చేశారని వీరిలో 8 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) నాలుగేళ్ల కిందట అరెస్టు చేసిందని పోలీసులు చెబుతున్నారు. మరో ఘటనలో 2018 సంవత్సరంలో ఇద్దరు యువకులను ఎన్‌ఐఏ అధికారులు పట్టుకున్న సంగతి తెలిసిందే.