స్మార్ట్ ఫోన్లు మన దైనందీన జీవితంలో భాగమయ్యాయి. ఎంతలా అంటే.. అవసరానికి ఏమున్నా లేకున్నా, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా చాలా మంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. ఇంకా చెప్పాలంటే వాటికి బానిస అయ్యాం అనేది 100కు 100శాతం కరెక్ట్ అవుతుందేమో. బెడ్ మీద నుంచి నిద్ర లేవడం నుంచి మొదలుకుంటే.. స్మార్ట్ ఫోన్ ను చూడడం కామ్ అయిపోయింది. లేచింది మొదలు.. పడుకొనే దాకా అత్యంత చేరువైన ప్రాణస్నేహితుడిగా స్మార్ట్ ఫోన్ మారిపోయింది. అవసరానికి మాత్రమే వాడాల్సిన ఈ ఎలక్ట్రానిక్ పరికరాన్ని.. అవసరం కంటే ఎక్కువగా వాడుతున్నాం. ఫలితంగా విజ్ఞానం మాట అలా ఉంచితే భద్రతా పరంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది.
ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. పిల్లలను ఏవిదంగా పెంచాలి, వారి సంరక్షణ బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంటుంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగించేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతా పరమైన నియమాలు, చిట్కాలను తల్లిదండ్రులతో పాటు యువత కూడా గమనించాలి.
- మీ సెల్ ఫోన్ కు ఎప్పుడూ లాక్ పెట్టుకోవాలి. కీప్యాడ్ లాక్ అందులో ప్రధానం. పిన్ లేదా పాస్వర్డ్ ను పెట్టుకోవడం వల్ల భద్రంగా ఉంచుకోవచ్చు. వేరేవాళ్లు మీ ఫోన్ లాక్కున్నా, దొంగిలించినా వారికి సమస్యగా మారుతుంది.
- సెక్సువల్ నేచర్ కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తీయకండి. ఎవరైనా నగ్నంగా లేదా అర్ధనగ్నంగా ఉన్న ఫొటోలు, వీడియోలు మీ వద్ద ఉంటే అవి చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు.
- ఛైల్డ్ పోర్నోగ్రఫి, అశ్లీలత వంటివాటిపై అన్ని రాష్ట్రాల్లో నిషేధం ఉంది. ఇది ఘోరమైన నేరంగా పరిగణిస్తారు. మరో విషయమేమంటే ఫోన్ ను తప్పుడు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా చూసుకోండి. లేదంటే మీ ప్రతిష్ట దెబ్బతినే అవకాశముంది.
- -సెల్ ఫోన్ ను కలిగి ఉండటమనేది స్వతంత్ర అధికారం. అంతేకాని ప్రత్యేకమైన హక్కు కాదనే విషయాన్ని గుర్తుంచుకోండి. తల్లిదండ్రులు మీకు ఫోన్ ఇవ్వడానికి అనుమతిచ్చారంటే మీరు ఆ గౌరవాన్ని కాపాడుకోవాలి. అయితే చాలా మంది యువత ఎలక్ట్రానిక్ పరికరాలను, సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. క్రిమినల్, చట్టపరమైన ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నారు. కాబట్టి తల్లిదండ్రులు ఇచ్చిన స్వేచ్ఛ విలువైందిగా భావించండి.
- మీకు సౌకర్యవంతంగా లేని ఫొటోలు, వీడియోలను మీ తల్లిదండ్రులకు షేర్ చేయవద్దు. అలాంటి సందేశాలు కూడా పంపవద్దు.
- మీ ఫోన్ లో ఉండే సందేశాలు, మీరు సృష్టించే ఫొటోలు, వీడియోలు డిజిటల్ సాక్ష్యంగా నిల్వచేయబడతాయి. మీరు డిలీట్ చేసినప్పటికీ మొబైల్ కంపెనీ సర్వర్లలోనో, క్లౌడ్ ఖాతా, మెమొరీ కార్డు, సిమ్ కార్డు వంటి వాటిలో సేవ్ అవుతాయి.
- ఎప్పుడూ టెక్స్ట్ చేసి డ్రైవ్ చేయవద్దు. మీ జీవితాన్ని కోల్పోవడం లేదా వేరొకరి ప్రాణాలు తీయడం ఏదీ ఉత్తమం కాదు. ఏదైనా అత్యవసరమైతే, దానితో వ్యవహరించే ముందు వాహనాన్ని సురక్షితమైన ప్రదేశం వద్ద ఆపండి. మీరు విశ్వసించగలగిన, మీకు తెలిసిన వ్యక్తులకు మాత్రమే మీ ఫోన్ నంబర్ ఇవ్వండి.
ఇక ఏ ఫోన్లకు ఎన్నాళ్లపాటు అప్డేట్స్ వస్తాయంటే..
ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం.. కొన్ని కంపెనీల స్మార్ట్ఫోన్లు ఎక్కువ కాలం, మరికొన్ని మోడల్స్ ఫోన్లు తక్కువ కాలం అప్డేట్స్ని అందిస్తాయి. ఇట్లా సాఫ్ట్వేర్, ఇంటర్నల్ అప్డేట్స్ రావడం వల్ల స్మార్ట్ ఫోన్ వేగవంతమైన పనితీరుతోపాటు, బగ్స్, మాల్వేర్ వంటివి ఫోన్లోకి చొరబడకుండా ఉంటాయి. అయితే.. ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఇవన్నీ మనం గమనించే చాన్స్ ఉండదు. ఫీచర్స్‌ని చూసి స్మార్ట్ఫోన్లను చాలామంది కొనుగోలు చేస్తుంటారు. కానీ, ఆ తర్వాత వాటికి అప్డేట్స్ రాకపోవడం, సాఫ్ట్వేర్ పరంగా ఎట్లాంటి మెరుగుదల లేకపోవడం వంటివి ఎదురవుతాయి. దీంతో అబ్బా.. ఈ ఫోన్‌ని ఎందుకు కొన్నామా? అనే ఫీలింగ్ కలగకమానదు. అందుకని, ఈ విషయాలను కూడా దృష్టిలో పెట్టుకుని ఆండ్రాయిడ్ ఫోన్లను కొనేముందు జాగ్రత్తలు తీసుకుంటారని భావిస్తున్నాం..
- శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో కంపెనీల ఫోన్లకు 4 సంవత్సరాల పాటు అప్డేట్స్, అయిదు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తుంటాయి.
- గూగుల్, షియోమీ, మోటరోలా, రియల్మీ, వివో, నోకియా కంపెనీల స్మార్ట్ఫోన్లకు మూడు సంవత్సరాల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.
- సోనీ, హానర్, అసూస్, టీసీఎల్ కంపెనీల ఫోన్లకు రెండేండ్ల పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్, మూడు సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి.