Wednesday, November 20, 2024

మ‌న రాజ్యంగం .. నైతిక సూత్రాల నియ‌మావ‌ళేనా?

న్యూఢిల్లి , ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – 74వ భారత గణతంత్ర దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. విదేశాల్లోని భారతీయులు కూడా ఈ అత్యున్నత వేడుకను జరుపుకున్నారు. భారత రాష్ట్రపతి నుంచి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వరకు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గణతంత్ర దినోత్సవ ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను వివరించారు. రాజ్యాంగం అమల్లోకొచ్చిన రోజు నుంచి దేశంలో జరిగిన పలు మార్పుల్ని ప్రస్తావించారు. భావి భారత దిశానిర్దేశం చేశారు. రాజ్యాంగాన్ని అందరూ గౌరవించుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాం గాన్ని భారత్‌ కలిగుందంటూ ఉద్భోదించారు. ఆహుతులంతా ఈ ప్రసంగాన్ని శ్రద్ధగా విన్నారు. టీవీల్లో లక్షలాదిమంది చూశారు. పేపర్లలో కోట్లాదిమంది చదివారు. అయితే ప్రపంచంలోనే అత్యున్నత విలువలు కలిగిన భారత రాజ్యాంగం పట్ల ఈ దేశంలోని సుమారు 140 కోట్ల జనంలో ఎంతమందికి కనీస అవగాహన ఉంది..? రాజ్యాంగం పౌరులకు కల్పించిన హక్కులేంటి? బాధ్యతలేంటి? ఈ హక్కులు నిర్దిష్టంగా అమలౌతున్నాయా? ప్రతి ఒక్కరు తమ రాజ్యాంగ విధుల్ని పాటిస్తున్నారా? రాజ్యాంగం ఆధారంగా రూపొందించుకున్న చట్టాల అమలు ఏ మేరకు జరుగుతోంది? ఈ చట్టాలు సక్రమంగా అమలు కాకపోవడానికి కారణాలేంటి? పౌరులు హక్కుల కోసం తాపత్రయ పడుతున్న స్థాయిలో బాధ్యతల నిర్వహణ పట్ల ఆసక్తి చూపక పోవడానికి దారితీస్తున్న పరిస్థితులేంటి? అసలు ఇంత గొప్ప రాజ్యాంగాన్ని కలిగిన భారత్‌లో ప్రజలకు దీనిపై అవగాహన కల్పించే ప్రయత్నాలేమేరకు జరిగాయన్న చర్చ ఇప్పుడు సర్వత్రా నెలకొంది.

దేశంలో సర్వోన్నత శాసనం భారత రాజ్యాంగమే. ఇది మౌలిక రాజకీయ సూత్రాల రూపాల్ని నిర్దేశిస్తోంది. ప్రభుత్వ సంస్థల విధులు, విధానాలు, అధికారాలు, నిర్మాణాల్ని స్పష్టం చేస్తోంది. ఈ రాజ్యాంగం ఆధారంగానే భారత్‌లో పాలన జరగాలి. ఇంత సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం ప్రపంచంలోనే మరే ఇతర సార్వభౌమ దేశాలకు అందుబాటులో లేదు. భారత రాజ్యాంగంలోని మూడవ భాగంలో ప్రజల ప్రాథమిక హక్కుల్ని పొందుపర్చారు. ఇవి ప్రజలందరికీ సమానంగా వర్తిస్తాయి. ప్రాథమిక హక్కులు దేశంలోని ప్రతి పౌరుడు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పర్చుకోవడానికి, బాధ్యత కలిగి హుందాగా జీవించేందుకు, ప్రభుత్వపరంగా చట్టరీత్యా స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కల్పించబడ్డాయి. పౌరులందరికీ సమానత్వపు హక్కు, స్వాతంత్య్రపు హక్కు, దోపిడీని నివారించే హక్కు, మత స్వాతంత్య్ర హక్కు, సాంస్కృతి, విద్యా హక్కు, రాజ్యాంగ పరిహార హక్కులు ప్రసాదించబడ్డాయి. అన్నింటికి మించి దేశంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా సమానత్వాల హక్కును రాజ్యాంగం కల్పించింది. రాజ్యాంగంలోని 19వ అధికరణం మేరకు ఆరురకాల స్వేచ్ఛలను భారత పౌరులకిచ్చింది. అలాగే కట్టు బానిసత్వం, బాలకార్మిక విధానాల్ని రాజ్యాంగం నిషేధించింది. దేశంలో సెక్యులరిజం సూత్రాల విస్తరణకు, తమ స్వాతంత్య్ర హక్కును కల్పించింది. అలాగే కొన్ని మతాల విశ్వాసాల కనుగుణంగా కొన్ని ప్రత్యేక హక్కుల్ని కూడా రాజ్యాంగం జారీ చేసింది. ప్రజల శ్రేయస్సు, ఆరోగ్యకర వాతావరణాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ హక్కులిచ్చింది.

భారత పౌరులందరికీ రాజ్యాంగం కొన్ని బాధ్యతల్ని కూడా నిర్దేశించింది. ప్రతి ఒక్కరు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి. ప్రభుత్వరంగ సంస్థలు, జాతీయ జెండా, గీతాల్ని గౌరవించాలి. స్వాతంత్య్ర పోరాట యోధుల ఆదర్శాల్ని గౌరవించాలి.. ఆచరించాలి. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతల్ని సమర్ధించాలి. దేశ రక్షణ కోసం సిద్దపడాలి. దేశ సేవ చేయాలి. ప్రజల మధ్య సామరస్యాన్ని, సోదర భావాన్ని పెంపొందించాలి. దేశ మిశ్రమ సంస్కృతి, వారసత్వాన్ని సంరక్షించాలి. పర్యావరణాన్ని, ప్రకృతి వనరుల్ని కాపాడాలి. శాస్త్రీయ దృక్పథం, మానవతావాదాల్ని కలిగుండాలి. ప్రజా ఆస్తుల్ని రక్షించాలి. దేశ ఉన్నతికి నిరంత రం కృషిచేయాలి. ఆరు నుంచి 14ఏళ్ళ మధ్యనున్న వారంతా విధిగా విద్యనభ్యసించాలి.

హక్కుల మాటెలా ఉన్నా విధుల నిర్వహణలో భారతీయులు మొదటి నుంచి పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇందుక్కారణ ం విధుల నిర్దేశకత్వంపైనే పలు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విధులను నిర్దేశించిన రాజ్యాంగం వీటిని అతిక్రమిస్తే విధించే శిక్షలను ఇక్కడ స్పష్టం చేయలేదు. ఈ విధులకు న్యాయబద్దతపై కూడా పలు విమర్శలు చెలరేగాయి. వీటిని కేవలం నైతిక సూత్రాల నియామావళిగానే విమర్శకులు అభివర్ణించారు. ప్రాథమిక హక్కులతో సమానంగా విధుల్ని నిర్దేశించుకున్నా అదనంగా జతచేయడంతోనే వీటికి విలువ తగ్గిందన్న అభిప్రాయం కూడా మొదటి నుంచి వెల్లువెత్తాయి.

- Advertisement -

ఈ ఫలితాల్ని ఇప్పటికే దేశం చవిచూస్తోంది. రాజ్యాంగం ఆధారంగా పలుచట్టాలు రూపొందాయి. వీటిలో ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ ఒకటి. పలు నేరాల్ని ఈ కోడ్‌లో పొందుపర్చారు. అయితే ఎక్కడా ప్రభుత్వం తనంత తానుగా నేరస్తుల్ని గుర్తించి కేసులు నమోదు చేసి న్యాయస్థానానికి అప్పగించే బాధ్యతను పేర్కొనలేదు. ఉదాహరణకు స్పష్టమైన న్యాయస్థానం విడాకులు మంజూరు చేసినా ఆరుమాసాల తర్వాత మాత్రమే పునర్‌వివాహానికి అర్హత ఉంటుంది. అయితే అసలు విడాకులే ఇవ్వకుండా భార్యను భయపెట్టి మళ్ళీ మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో అనూహ్యంగా పెరుగుతోంది. ఇలాంటి కేసుల్లో భార్య లేదా ఆమె తరపు వ్యక్తులు స్టేషన్‌కెళ్ళి ఫిర్యాదు చేస్తే తప్ప ఇలాంటి సంఘటనల్లో కేసులు నమోదు చేసే అవకాశముండదు. దీంతో నేరస్తులు ఇష్టారాజ్యంగా చట్టాల్ని తుంగలో తొక్కి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అలాగే 14ఏళ్ళ వరకు ఖచ్చితంగా పాఠశాలలకు పంపాలన్న నిబంధనుంది. కానీ దీనిపై ప్రజలకు ఏమాత్రం అవగాహనలేదు. దేశంలో మహిళలకు ఆస్తిలో సమాన హక్కుంది. కానీ సాధారణ కుటుంబాల నుంచి ఉన్నత కుటుంబాల వరకు ఎక్కడా ఇది ఆచరణకు నోచుకోలేదు. మహిళలకున్న సమాన ఆస్తి హక్కును పురుషులు చిదిమేస్తున్నారు.

ఈ విషయంపై దేశంలో మెజారిటీ మహిళలకు కూడా అవగాహన కొరవడింది. ఇందుకు కారణం దేశంలో అక్షరాస్యత శాతాన్ని అనూహ్యంగా పెంచి ప్రపంచం ముందు ప్రచారం చేసుకోవాలన్న ఆతృత పాలకుల్లో నెలకొనడమే. ఈ క్రమంలో కేవలం తన పేరు తాను రాస్తే అక్షరాస్యులుగా గుర్తించే నిబంధనను గత 75ఏళ్ళుగా దేశంలో అమలు చేస్తున్నారు. ఇలా అక్షరాస్యత పెరిగిందంటూ లెక్కలు చూపుతున్నారు. ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని చిన్న చిన్న దేశాల్లో కూడా అక్షరాస్యత గణనకు కొన్ని ప్రత్యేక నిబంధనల్ని అనుసరిస్తున్నారు. వారి కోసం కొన్ని కోర్సులు అమలు చేస్తున్నారు. వాటిపై అవగాహన కలిగితేనే అక్షరాస్యులుగా పరిగణనలోకి తీసుకుంటున్నారు. భారత్‌లో అసలు అక్షరాస్యతే కొరవడింది. దీంతో రాజ్యాంగ హక్కులు, బాధ్యతల్ని తెలుసుకోవడం 60శాతానికి పైగా జనానికి కష్టం. ఆ దిశగా వారిలో అవగాహన పెంపొందించాలన్న ఆసక్తి ప్రభుత్వంలో లేదు. తొలుత ప్రతి ఒక్కరికి కనీస విద్యార్హతలపై ప్రభుత్వాల దృష్టి పెడితే భారత రాజ్యాంగం ఉదాత్తత, అది కల్పించిన హక్కులు, బాధ్యతల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలుగుతుంది. తద్వారా రాజ్యాంగ ఫలాల్ని సాధారణ ప్రజలు కూడా పొందగలుగుతారు. గత అక్టోబర్‌లో కేంద్రం భారత రాజ్యాంగంపై అవగాహన కల్పించేందుకు ఉచిత ఆన్‌లైన్‌ కోర్సుల్ని ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయవ్యవహారాల విభాగం, న్యాయశాఖ, నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ లీగల్‌ స్డటీస్‌ అండ్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లా, ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాయి. అయితే ఇవి పూర్తిగా ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆధారిత కార్యక్రమం మాత్రమే. దీంతో సాధారణ ప్రజలకు కూడా ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొనే వీలు లభించడంలేదు. ఇక నిరక్షరాస్యులు, సాధారణ విద్యార్హత కలిగిన వారికి అసలు ఈ సమాచారమే అందుబాటులో లేదు. ఈ కారణంగానే ఎంతో గొప్ప రాజ్యాంగం ఈ దేశానికి ఉన్నప్పటికీ కేవలం గణతంత్ర దినోత్సవం, రాజ్యాంగ దినోత్సవాల రోజున ప్రసంగాలకు మాత్రమే ఇది పరిమితమౌతోంది. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలపై సాధారణ ప్రజలకు మాత్రం అవగాహన కొరవడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement