మోతె, (ప్రభన్యూస్) :చేపలు పట్టేందుకు చెరువు నీటిని వదిలిన ఉదంతం నల్గొండ జిల్లా మోతె మండల పరిధిలోని రావిపహాడు గ్రామంలోని పెద్ద చెరువులో చోటుచేసుకుంది. వారం రోజుల క్రితం పెద్దచెరువులో చేపలు పట్టారు. దీంతో మళ్లీ పట్టేందుకు నీరు ఎక్కువగా ఉండటంతో సదరు వ్యాపారి నీటిని దిగువకు వదిలేశారు. దీంతో గురువారం రాత్రి నుంచి నీరంతా వృధాగా తూము ద్వారా బయటకు తరలిపోతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఈ తతంగాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకుండా వ్యాపారికి వంతపాడటం వెనక అంతర్యం ఏమిటో చెప్పాలని గ్రామ ప్రజలు నిలదీస్తున్నారు. చెరువు కింద ఆయకట్టు ఉండడంతో వానాకాలం, యాసంగి పంటలు పండిస్తున్నారు. దీంతోపాటు బావులు, బోర్లలో భూగర్భ జలాలు పెరగడానికి చెరువు నీరు దోహదపడుతుంది. చేపలు పట్టడానికి నీటిని వృధా చేస్తుండడంతో గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో వర్షాలు రాకపోతే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. నీటిని వృధాగా వదిలేస్తున్న వ్యాపారిపై దానికి సహకరించిన మరికొందరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.